పవన్ ట్విట్టర్ అక్కౌంట్ సంగతేమిటి?

జనసేనాధిపతి ట్విట్టర్ అక్కౌంట్ సంగతేమిటి? అది ఏక్టివ్ గానే వుందా? లేక ఇంకా బ్లాక్ అయి వుందా? కొద్ది రోజుల క్రితం వున్నట్లుండి జనసేన నుంచి ప్రకటన బయటకు వచ్చింది. పవన్ కళ్యాణ్ ట్విట్టర్ అక్కౌంట్ బ్లాక్ అయిందని, దీనిపై నిపుణులతో మాట్లాడుతున్నామని, అసలు విషయం తెలిసిన తరువాత ఏ చర్యలు తీసుకోవాలో ఆలోచిస్తామని ఆ ప్రకటనలో తెలిపారు.

ఇది జరిగి రోజులు గడుస్తున్నాయి కానీ, ఏ విషయం మళ్లీ అప్ డేట్ లేదు. నిజానికి ట్విట్టర్ అక్కౌంట్ బ్లాక్ అయితే దాన్ని సరి చేయాల్సింది ట్విట్టర్ కు చెందిన వారే. మరి పవన్ తరపున ఎవరైనా ట్విట్టర్ ను సంప్రదించారో లేదో? ట్విట్టర్ కూడా సెలబ్రిటీల అక్కౌంట్ల విషయంలో చాలా చురుగ్గా వుంటుంది. మరి పవన్ అక్కౌంట్ బ్లాక్ విషయం ట్విట్టర్ సిబ్బందికి తెలిసిందో లేదో?

ఈ సంగతి అలా వుంచితే సాఫ్ట్ వేర్ నిపుణులు పవన్ ట్విట్టర్ అక్కౌంట్ ను పరిశీలిస్తున్నారు అన్నారు. నిపుణులకు జస్ట్ ఓ బ్లాక్ ను అన్ బ్లాక్ చేయడం ఇంత కాలం పడుతుందా? ట్విట్టర్ తో సంబంధం లేకుండా వీళ్లు అన్ బ్లాక్ చేయగలరా?  ఇప్పటికీ ఏ విషయం పవన్ ఆఫీస్ నుంచి అప్ డేట్ రాకపోవడం చిత్రంగా వుంది.

ఇదిలా వుంటే నార్త్, సౌత్ అంటూ పవన్ తరచు ఈ మధ్య జనాల సెంటిమెంట్ రాజేసే ప్రకటనలు చేస్తున్నారు. భాజపాను ఇండైరెక్ట్ గా టార్గెట్ చేస్తున్న ఈ వైనం వెనుక చంద్రబాబు రాజకీయం వుందన్న నివేదికలు అమిత్ షాకు, మోడీకి ఆంధ్ర నుంచి వెళ్లాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోపక్క రాష్ట్రంలో ఐఎఎస్ ల్లో కూడా పవన్ కామెంట్ల పట్ల కాస్త అసంతృప్తి నెలకొంది. 

పవన్ వల్ల ఇటు చంద్రబాబు కూడా కాస్త ఇరకాటంలో పడుతున్నారు. ఇలాంటి టైమ్ లో ట్విట్టర్ అక్కౌంట్ బ్లాక్ అయిందంటున్నారు. కాగల కార్యం గంధర్వులు తీర్చారు అన్నట్లు, కొన్నాళ్లు ట్విట్టర్ అక్కౌంట్ అలాగే వుంటే, పవన్ దేని మీదా స్పందించలేదు అన్న కామెంట్లు వినిపించవు. మరి అందుకోసమే ఆ అక్కౌంట్ ను అలాగే వుంచారా? లేదా అది రెక్టిఫై అయిందా? అన్న విషయాల జనసేన నుంచి క్లారిటీ వస్తేనే తెలుస్తుంది.

Show comments