మలార్‌కి 'ఫిదా' అవ్వాల్సిందే.!

మన తెలుగు నేటివిటీకి సూటయ్యే ఫీచర్స్‌ ఆమెలో కన్పించవు. కానీ, టాలీవుడ్‌లో ఇప్పుడామె 'న్యూ సెన్సేషన్‌'. అవును, 'ఫిదా' సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతున్న మలయాళ బ్యూటీ సాయి పల్లవి పేరు, తొలి సినిమా విడుదల కాకముందే టాలీవుడ్‌లో మార్మోగిపోతోంది. వరుస ఆఫర్లు వచ్చిపడ్తున్నా, సాయిపల్లవి చాలా అవకాశాల్ని కాదనుకుంటోందట. మంచి సినిమాల్ని ఎంచుకోవాలన్న ఉద్దేశ్యంతోనే వస్తున్న అవకాశాల్ని 'ఫిల్టర్‌' చేస్తోందంటూ 'మలార్‌' గురించి టాలీవుడ్‌లో గుసగుసలు గుప్పుమంటున్నాయి. 

మలయాళ 'ప్రేమమ్‌'లో సాయిపల్లవి పాత్ర పేరు మలార్‌. దాంతో, 'మలార్‌' బ్యూటీ అనే పేరు సాయిపల్లవికి అలా ఫిక్స్‌ అయిపోయిందంతే. ఇక, సాయిపల్లవి బర్త్‌ డే సందర్భంగా, 'ఫిదా' సినిమా మోషన్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు. ఈ పోస్టర్‌ గురించి దర్శకుడు హరీష్‌ శంకర్‌ కామెంట్‌ చేస్తూ, 'న్యూ సెన్సేషన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు' అని ట్వీటేశాడు. 

ఇక, 'ఫిదా' చిత్రానికి శేఖర్‌ కమ్ముల దర్శకుడు కాగా, వరుణ్‌ తేజ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం విదితమే. అమెరికా అబ్బాయి, తెలంగాణ అమ్మాయి.. ఇద్దరి మధ్యా లవ్‌స్టోరీ.. ఇదీ అసలు కాన్సెప్ట్‌. అయితే లవ్‌ - హేట్‌ - లవ్‌ స్టోరీ.. అంటూ మోషన్‌ పోస్టర్‌లో క్యాప్షన్‌ పెట్టి, ఇదో వెరైటీ లవ్‌ స్టోరీ అనే సంకేతాలు పంపాడు దర్శకుడు శేఖర్‌ కమ్ముల. ఏమాటకామాటే చెప్పుకోవాలి ’ఫిదా‘ మోషన్ పోస్టర్, అందులో సాయి పల్లవి పోజ్.. అదరహో అన్పించేలా వున్నాయి. అదే మలార్ స్పెషాలిటీ అనుకోవాలేమో. ఒక్క ఫొటోతో మలార్, కుర్రకారు మనసుల్ని దోచేసేంత కళాత్మకంగా ఈ మోషన్ పోస్టర్ రూపొందించడం గమనార్హం.

Show comments