నరేంద్ర మోడీ మార్క్‌ 'బిచ్చం'.!

పెట్రోల్‌, డీజిల్‌ వినియోగదారులకు శుభవార్త.. మొబైల్‌ బ్యాంకింగ్‌, ప్లాస్టిక్‌ మనీ (అదేనండీ, డెబిట్‌ కార్డులు) ద్వారా చెల్లింపులు చేస్తే, లీటర్‌ పెట్రోల్‌ లేదా డీజిల్‌పై 0.75 పైసలు తగ్గింపు వర్తిస్తుంది. ఇది గతంలోనే కేంద్రం ప్రకటించిన నిర్ణయం. ఆల్రెడీ అమల్లోకి వచ్చేసినట్లే. కానీ, ఎక్కడ.? అని మాత్రం అడక్కండి. వచ్చేసిందంటే, వచ్చేసిందంతే. 

తాజాగా, మరో శుభవార్త.. ఈసారి వంట గ్యాస్‌ వంతు. పైన చెప్పుకున్న పద్ధతుల్లో చెల్లింపులు జరిపితే సిలెండర్‌ మీద 5 రూపాయల రాయితీ ఇస్తారట. వారెవ్వా, ఇంతకన్నా బంపర్‌ ఆఫర్‌ ఇంకేమన్నా వుంటుందా.! ఛాన్సే లేదు. దేశ ప్రజల్ని బిచ్చగాళ్ళుగా మార్చేసి, బ్యాంకులు - ఏటీఎంల వద్దనే కాదు, డి-మార్ట్‌, బిగ్‌ బజార్‌ వంటి షాపింగ్‌ మాల్స్‌ దగ్గరా క్యూ లైన్లలో నిలబెట్టేసిన ప్రధాని నరేంద్రమోడీ, ఇప్పుడు దేశ ప్రజల బొచ్చెల్లో 'రాయితీ' పేరుతో బిచ్చమేస్తున్నారు. 

మామూలుగా పెట్రోల్‌ బంక్‌కి వెళ్ళి, కావాల్సినంత పెట్రోల్‌ లేదా డీజిల్‌ పోయించేసుకున్నాక కదా, కార్డ్‌ని స్వైప్‌ చేసేది. మరి, అక్కడ మీటర్‌లో చూసి డెబిట్‌ కార్డుని స్వైప్‌ చేసే సిబ్బంది, మీటర్‌కి అనుగుణంగానే అమౌంట్‌ ఫీడ్‌ చేస్తున్నప్పుడు, రాయితీ ఎలా సామాన్యుడికి దక్కుతుందట.? ఈ ప్రశ్నే కేంద్ర మంత్రుల ముందు మీడియా వుంచితే.. ఏవేదో 'పాచి' లెక్కలు చెప్పి తప్పించుకున్నారనుకోండి.. అది వేరే విషయం. 

50 రోజుల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోతుంది.. దేశం అభివృద్ధిలో దూసుకుపోతుంది.. సామాన్యులకి కొత్త కాంతులు కన్పిస్తాయి.. అవినీతి అంతమైపోతుంది.. నల్లధనం మటుమాయమైపోతుంది.. అంటూ ఏవేవో లెక్కలు చెప్పిన ప్రధాని నరేంద్రమోడీ, ఇప్పుడు మాత్రం ఆ వ్యవహారమ్మీదనే పెదవి విప్పడంలేదు. 'చెయ్యాలనుకున్నది చేసేశాం.. మీ ఛావు మీరు ఛావండి..' అంటూ జనాన్ని నరకంలోకి తోసేశారు. 

పెట్రో ధరలు పెరిగాయి.. బ్యాంకుల్లో కష్టాలు షరామామూలుగానే వున్నాయి. అవినీతి సరే సరి, నల్ల కుబేరులంతా చల్లగా సర్దేసుకున్నారు. ఇక, మార్పు వచ్చిందెక్కడ.? పైగా, ఈ బిచ్చం కబుర్లతో 'పుండు మీద కారం' చల్లుతున్నట్లుంది పరిస్థితి. వంట గ్యాస్‌ సిలెండర్‌ ధర విషయంలో సామాన్యుల్ని ఆయిల్‌ కంపెనీలు, డీలర్లు ఎలా వేధింపులకు గురిచేస్తున్నారన్నది జగమెరిగిన సత్యం. ఒక్కో సిలెండర్‌ మీదా 15 నుంచి 50 రూపాయలదాకా అదనంగా వసూలు చేస్తున్నారు. ఇప్పుడీ 5 రూపాయల రాయితీ.. ఎవరి చేతుల్లోకి.? ఎవరి బొచ్చెలోకి.?

Show comments