బాబు మిత్రుడు.. కేసీఆర్‌ అంతకు మించి.!

బీజేపీకి తెలుగుదేశం పార్టీ మిత్రపక్షం. ఆ లెక్కన, ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 'రాజకీయ' స్నేహితుడు కావొచ్చు. మరి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంగతేంటి.? మోడీకి, కేసీఆర్‌ స్నేహితుడు మాత్రమే కాదు.. అంతకు మించి.! తెలంగాణలో, బీజేపీ 'ప్రతిపక్షం' అనే స్థాయిలో, అధికార టీఆర్‌ఎస్‌తో పోటీ పడ్తోన్న విషయం విదితమే. అయినాసరే, తెరవెనుక కేసీఆర్‌, నరేంద్రమోడీతో అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. 

చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళడం మామూలే.. కేసీఆర్‌ కూడా వెళుతుంటారు. ఏ ముఖ్యమంత్రి అయినా, ఢిల్లీకి వెళ్ళడం, కేంద్రంతో సంప్రదింపులు జరపడం, ఈ క్రమంలో ప్రధానితో భేటీలు సర్వసాధారణంగా జరిగే ప్రక్రియే. అయితే, ప్రధానిని కలిసి వచ్చాక, ఆయా వ్యక్తుల బాడీలాంగ్వేజ్‌ని బట్టి, అక్కడ వారికి దక్కుతున్న గౌరవాన్ని అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు ఢిల్లీకి వెళతారు, ప్రధానితోనో ఇతర కేంద్ర మంత్రులతోనో సమావేశమవుతారు. తిరిగొచ్చాక, ఆయన ఫేస్‌లో ఎక్కడా 'ఆనందం' అనేది కన్పించదు. కేసీఆర్‌ విషయంలో పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా కన్పిస్తాయి. ప్రధానిని కలిసొచ్చాక కేసీఆర్‌లో, కొత్త ఉత్సాహాన్ని చూస్తుంటాం. అక్కడేం జరుగుతుంది.? అన్నది వేరే విషయం.. తనను కలిశాక ఆయా ముఖ్యమంత్రులు వ్యవహరించే తీరుపై, ప్రధాని హోదాలో నరేంద్రమోడీ నిఘా పెట్టకుండా వుంటారా.? 

చంద్రబాబు ఢిల్లీకి వెళితే సమస్యలు ఏకరువు పెడ్తారన్నది టీడీపీ నేతల వాదన. కానీ, చంద్రబాబు నిజంగానే అంతలా ప్రధానిని ప్రశ్నించే అవకాశం వుందా.? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. రాజధాని అమరావతి శంకుస్థాపనకు మోడీని రప్పించిన చంద్రబాబు, ప్రత్యేక హోదా గురించి ప్రశ్నించలేకపోవడమే ఇందుకు నిదర్శనం. 

చంద్రబాబు దగ్గర కేసీఆర్‌ ఒకప్పుడు పనిచేశారేమో.! అది గతం. కానీ, రాజకీయ వ్యూహాల్లో చంద్రబాబుని ఎప్పుడో మించిపోయారు కేసీఆర్‌. ప్రధానితో వ్యవహరించాల్సిన తీరు విషయంలోనూ కేసీఆర్‌ వ్యూహాత్మకంగా అడుగులేస్తుంటారు. ప్రధానిని అభినందనలతో ముంచెత్తడం, ముఖ్యమంత్రిగా తనకు తోచిన సలహాలివ్వడంతోపాటు, తెలంగాణకు ఏం కావాలన్నా అక్కడ కుండబద్దలుగొట్టేస్తారు. ప్రధాని, కేసీఆర్‌ డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించడం, ఆ దిశగా కసరత్తులు ముమ్మరం చేయడం చూస్తూనే వున్నాం. 

ఏపీ విషయంలో మాత్రం, మోడీ ఆలోచనలు చాలా చాలా భిన్నంగా కన్పిస్తాయి. 'చేసేస్తున్నాం, ఇక చెయ్యాల్సిన అవసరం లేదు..' అన్న భావన ఆయనలో పెరిగిపోయింది. పైగా, చంద్రబాబుతో మోడీకి 'నస' అన్న భావన పెరిగిపోయింది. ఈ విషయాన్ని బీజేపీ నేతలే స్వయంగా చెబుతున్నారాయె. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే నరేంద్రమోడీ చంద్రబాబు రాజకీయంగా మిత్రుడే కావొచ్చు.. కేసీఆర్‌ మాత్రం అంతకు మించి.. అన్న వాదనని ఎలా కొట్టి పారేయగలం.?

Show comments