కొన్ని అరెస్టులు తప్పవా?

సినిమా జనాలు, మత్తు మందులకు సంబంధించి కనీసం ఒకటి రెండు అరెస్ట్ లు తప్పవన్న ఊహాగానాలు శనివారం సాయంత్రం నుంచి ఊపందుకున్నాయి. అయితే అవి ఇప్పటికిప్పుడు వుండవని, ఎవరికి వారు వచ్చి, వారి వివరణ ఇవ్వడం, ఆ సమయంలో వారిని ఎందుకు పిలిచారు, పోలీసుల దగ్గర వున్న ఆధారాలు ఏమిటి? అన్నవి చూపించి, విచారించి, మరిన్ని వివరాలు రాబట్టిన తరువాతే వుంటాయని అంటున్నారు.

దాదాపు డజను మందికి సంబంధాలు వున్నట్లు పోలీసులు అనుకుంటున్నా, ఇద్దరు హీరోలు, ఓ డైరక్టర్ కీలకంగా భావిస్తున్నట్లు వార్తలు అందుతున్నాయి. వీళ్లకు సంబంధించి బలమైన ఆధారాలు పోలీసులకు అడియో ఫైల్స్, మెసేజ్ ఫైల్స్ రూపంలో దొరికాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందరూ అనుకున్నట్లు ఈ కేసును నీరు గార్చడం జరగడదని, వ్యవహారం తెరవెనుక సీరియస్ గానే వుందని టాక్ వినిపిస్తోంది.

అలా దొరికారా?

ఇదిలా వుంటే ఈ డ్రగ్స్ విషయంలో కొందరు పేర్లు కూడా దొర్లడం వెనుక వైనం వేరే వున్నట్లు తెలుస్తోంది. సినిమాల అవకాశాలు చిక్కించుకోవడం కోసం, సదరు డైరక్టర్ కనుసన్నలలో వుండడం కోసం, వీళ్లు ఒక్కోసారి పేమెంట్లు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అంటే అదెలా అంటే, ‘నీకు ఒకడు ఫోన్ చేస్తాడు. వాడికి నీ దగ్గర వున్న ఆ అమౌంట్ అందచేయి’ అని అంటే, వాడు కాంట్రాక్టులోకి వచ్చాక, ఇవ్వడం అన్నమాట.

ఇండస్ట్రీలో అందరూ కాకున్నా కొందరు డైరక్టర్లు టెక్నీషియన్ల దగ్గర కమిషన్లు నొక్కుతారని టాక్ వుంది. అలా అయితేనే తమ సినిమాలకు వాళ్లను తీసుకుంటారు. పైగా ఆ కమిషన్ కూడా టెక్నీషియన్లకు పోయింది ఏమీ లేదు. రెమ్యూనిరేషన్ ను కాస్త అదనంగా చెప్పి, డైరక్టర్లే నిర్మాతలతో ఇప్పిస్తారు. అలాంటి అమౌంట్లు ఇలా వాడితే, వీళ్ల ఫోన్ నెంబర్లు, కాల్ లిస్ట్ లు డ్రగ్స్ తో లింక్ వున్నవాళ్ల దగ్గరకు చేరినట్లు తెలుస్తోంది.

ఇప్పుడు ఈ వివరాలు అన్నీ వివరంగా దర్యాప్తు అధికారులకు చేరాల్సి వుంటుంది. అప్పుడు అదే కనుక పక్కా అయితే, అన్నీ కలిసి ఒకరి మీదకే చేరతాయి. దాంతో ఇంక అరెస్టులు తప్పకపోవచ్చని వినిపిస్తోంది.

నయీం కన్నా పెద్ద కేసా?

ఇదిలావుంటే పలుకుబడి వుంటే ఏదీ బయటకు రాదని, నయీం ఎన్ కౌంటర్ టైమ్ లో ఇంతకన్నా భయంకరంగా చాలా మంది పేర్లు వినిపించాయని, మెషీన్లతో డబ్బులు లెక్కించారని, ఇప్పుడు అసలు ఆ కేసు ఏమయిందో? ఏ స్థితిలోవుందో? ఎవరికైనా తెలుసా? అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఫలానా అధికారి వున్నారని, ఫలానా పెద్ద తలకాయలు వున్నాయని అప్పట్లో మీడియా తెగ హడావుడి చేసింది. ఇప్పుడు చేసినట్లే. అందువల్ల ఈ డ్రగ్స్ కేసు కూడా కొన్నాళ్ల తరువాత చల్లారుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఆంధ్ర-తెలంగాణ

ఇదిలా వుంటే ఈ వ్యవహారంలో వున్నదంతా ఆంధ్ర జనాలే కనుక, తెరాస ప్రభుత్వం వీలయినంత స్మూత్ గా డీల్ చేసే అవకాశం వుందని కూడా టాక్ వినిపిస్తోంది. ఆంధ్ర వాళ్లని టార్గెట్ చేస్తున్నారు అన్న ఫీల్ జనాల్లోకి రాకూడదని, అలాగే టాలీవుడ్ జనాలు ఇక్కడ సేఫ్ కాదు, ఆంధ్రకు వెళ్లాలన్న ఆలోచన చేయకూడదని, ఆ విధంగా వీలయినంత పకడ్బందీగా దర్యాప్తు సాగాలని తెరాస ప్రభుత్వం ఆలోచిస్తోందని వదంతులు వినవస్తున్నాయి.

Show comments