‘వీరుడొక్కడే’ సినిమాను వీలైనన్ని ఎక్కువసార్లు ప్రసారం చేసేస్తోంది ఒక టీవీ చానల్. 24 గంటలూ సినిమాలు ప్రసారం చేసే ఆ చానల్ లో వేసిన సినిమాలనే వేస్తూ పోతూ ఉంటారు. ఈ పరంపరలో అజిత్ హీరోగా నటించిన ఆ సినిమాను అనునిత్యం ప్రసారం చేస్తూ అరగదీసేస్తున్నారు!
మరి ఈ సినిమాను ఇలా రెగ్యులర్ గా ప్రసారం చేయడం పవన్ ‘కాటమరాయుడు’ పై పరోక్ష ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. అజిత్ ‘వీరుడొక్కడే’ ను ఆధారంగా చేసుకునే ‘కాటమరాయుడు’ రూపొందుతోందని వేరే చెప్పనక్కర్లా. అప్పట్లోనే ‘వీరమ్’ తమిళ వెర్షన్ ‘వీరుడొక్కడే’ గా తెలుగులోకి అనువాదమై, విడుదలైనా.. పవన్ మాత్రం ఆ సినిమాను రీమేక్ చేస్తున్నాడు. ఈ రీమేక్ మేకింగ్ దశలోకి వచ్చాకా.. టీవీలో ‘వీరుడొక్కడే’ తెగ ప్రసారం అవుతోంది!
ఎంత కాదనుకున్నా అజిత్ తెలుగు వాళ్ల మధ్య గుర్తింపు కలిగిన నటుడే, టీవీలో అతడి అనువాద సినిమాలు ప్రసారం అవుతుంటే.. వాటికి వీక్షకాదరణ ఉండనే ఉంటుంది. మరి ఈ ఆదరణ ‘కాటమరాయుడు’ కథపై సస్పెన్స్ ను చాలా మందిలో తగ్గించేసే అవకాశాలు పెరుగుతాయి సుమా!