బాబూ.. ఎన్టీఆర్ విగ్రహాన్నీ మీ ఇంట్లో పెట్టుకోవచ్చుగా!

విగ్రహాలు రోడ్డుకు అడ్డంగా ఉన్నాయి.. అభిమానం ఉంటే ఆ విగ్రహాలను మీ ఇంట్లో పెట్టుకోండి..అంటూ చాలా పదునైన సమాధానాన్నే చెప్పాడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. విజయవాడలో వైఎస్ విగ్రహం తొలగింపు అంశంపై బాబు గట్టి సమాధానమే ఇచ్చారు. అయితే తెలుగుదేశాధినేత ఏం మాట్లాడినా.. అందులో ఆయనకు వర్తించే అంశాలూ చాలానే ఉంటాయి. ఇందుకు విగ్రహాల అంశం కూడా మినహాయింపు కాదు.

వైఎస్ విగ్రహం తొలగించిన తీరు గురించి భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకించి “అభిమానం ఉంటే మీ ఇంట్లో పెట్టుకోండి..’ అంటూ మాట్లాడిన తీరు గురించి వ్యంగ్యాస్త్రాలకు లోటు లేదు. ఈ మాట కేవలం వైఎస్ విగ్రహాలకు మాత్రమే చెల్లుబాటు అవుతుందా? ఒకవైపు వైఎస్ విగ్రహాల విషయంలో ఇలా మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ విగ్రహాల విషయంలో వ్యవహరిస్తున్న తీరు ఏమిటి? అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు.

గోదావరి పుష్కరాలప్పుడు..కృష్ణుడి వేషంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. పగటి వేషం వేశారు తెలుగుదేశం వాళ్లు. అంతేనా.. అమరావతిలో ఎన్టీఆర్ ది ఏదో పెద్ద విగ్రహం ఒకటి ఏర్పాటు చేస్తారట. దాని ఎత్తు 50 అడుగుల వరకూ ఉంటుందట! మరి ఎవడబ్బ సొమ్ముతో ఇలాంటి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు?

వైఎస్ విగ్రహాల విషయానికి వస్తే.. మొదట్లో కాంగ్రెస్ నేతలు ఆ విగ్రహాలను డొనేట్ చేసుకొంటూ వచ్చారు. ఏ పల్లెవాళ్లు వెళ్లి మేం వైఎస్ విగ్రహాన్ని పెడతామని అడిగినా కొంతమంది కాంగ్రెస్ లీడర్లు విగ్రహాలను ఇచ్చారు. మరి కొన్ని చోట్ల వైఎస్ అభిమానులు తలా కొంత వేసుకుని వైఎస్ విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నారు. అనుమతులు తీసుకున్న పిమ్మట వాటిని ఆవిష్కరించుకున్నారు. మరి అలాంటి విగ్రహాలను అయితే ఎంచక్కా తొలగించేస్తున్నారు.

మరోవైపు ప్రజల సొమ్ముతో ఎన్టీఆర్ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు! అదీ తెలుగుదేశాధినేత తీరు. అంతగా అభిమానం ఉంటే.. తమ ప్రైవేట్ సొమ్ములతో ఎన్టీఆర్ విగ్రహాలను పెట్టుకోవచ్చు. కానీ..ప్రభుత్వ సొమ్ముతో ఏర్పాటు చేయడం ఏమిటి? బాబుకు అంతగా అభిమానం ఉంటే తన ఇంట్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టుకోవాలి కానీ.. ఇలా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడం ఏమిటనే ప్రశ్నలూ వినిపిస్తున్నాయి. అయితే బాబుగారు ఏదైనా చెప్పడం వరకే.. పాటించడం ఉంటుందా!

Show comments