'జెంటిల్‌మెన్‌'.. సూపర్బ్‌ మేనియా.!

నాని చిన్న సినిమాలకి పెద్ద హీరో. 'భలే భలే మగాడివోయ్‌' సినిమాతో మంచి కమర్షియల్‌ హిట్‌ అందుకున్నాడు. 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' కూడా మంచి విజయాన్నే అందుకుంది. ఈసారి హ్యాట్రిక్‌ కొట్టేయాలన్న కసితో వున్న నాని, 'జెంటిల్‌మెన్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న విషయం విదితమే. మరికొద్ది గంటల్లోనే సినిమా ఫలితం తేలిపోనుంది. 

వాస్తవానికి ఈ సినిమాకి సంబంధించి ఓ సీక్రెట్‌ పాయింట్‌ చుట్టూ సినిమా ప్రమోషన్‌ కొనసాగిస్తోంది చిత్ర యూనిట్‌. సినిమాలో నాని హీరోనా.? విలనా.? అన్న విషయమ్మీద క్లారిటీ లేదు. ఆ క్లారిటీ కావాలంటే సినిమా చూడాల్సిందేనంటున్నాడు నాని. కాస్సేపు పాజిటివ్‌గా, కాస్సేపు నెగెటివ్‌గా సినిమా ప్రోమోస్‌లో నాని కన్పిస్తున్నాడు. బాలీవుడ్‌లో షారుక్‌ఖాన్‌ హీరోగా వచ్చిన 'బాజీగర్‌' తరహా సినిమా ఇదంటూ ఇప్పటికే సినిమాపై గాసిప్స్‌ విన్పిస్తున్నాయి. నాని మాత్రం, ఆ గాసిప్స్‌ని కొట్టి పారేయడం లేదు, సమర్థించడమూ లేదు. దాంతో సస్పెన్స్‌ మరింత పెరిగిపోతోంది. 

ఇక, ఈ సస్పెన్స్‌ ఎంతో సేపు కొనసాగే అవకాశం లేదు. కొద్ది గంటల్లోనే సినిమా విడుదలయిపోనుంది గనుక, సినిమా కథేంటన్నది తేలిపోతుంది.. ఆ సస్పెన్స్‌ కూడా రివీల్‌ అయిపోతుంది. ఒక్కటి మాత్రం నిజం. నాని మంచి నటుడు. పాత్రలో జీవించేయడం నానికి వెన్నతో పెట్టిన విద్య. ఆ నటనతోనే గత రెండు సినిమాల్లోనూ అదరగొట్టేశాడు. ఆ మాటకొస్తే, తొలి సినిమా నుంచి నాని నటనకు వంకలు పెట్టడానికేమీ లేదు. 

సో, మరోమారు 'జెంటిల్‌మెన్‌' సినిమాతో మార్కులేయించుకోవడానికి నాని రెడీ అయిపోయాడన్నమాట. సినిమా సక్సెస్‌, ఫెయిల్యూర్‌ అన్నది వేరే విషయం. అందుకే నాని సినిమా కోసం ఆడియన్స్‌ చాలా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు నాని సినిమా కోసం ఎక్కువగా ఎదురుచూస్తుండడం గమనార్హం. నాని మేనియా పుణ్యమా అని ఓపెనింగ్స్‌ అదిరిపోతాయని టాలీవుడ్‌ ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Show comments