ఫ్యాక్షన్‌ కథ.. కొత్తగా ఎలా వుంటుంది.?

పాత కక్షలు.. ఆ కారణంగానే జరిగిందో హత్య.! సింగిల్‌ లైన్‌, ఇంతకు మించి ఫ్యాక్షన్‌ కథల్లో కొత్తదనమేముంటుంది.? కర్నూలు జిల్లాకి చెందిన వైఎస్సార్సీపీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యకేసుకి సంబంధించి నిందితుల్ని పోలీసులు 'చాకచక్యం'గా పట్టుకున్నారు.. మీడియా ముందుకు తీసుకొచ్చారు. 'మా సొంత పొలాలకే మేం, నారాయణరెడ్డికి కప్పం కట్టాల్సి వచ్చింది.. మా తాత తండ్రుల్ని చంపేశారు.. మా మహిళల్ని చెరపట్టారు.. ఈ పరిస్థితుల్లో అతన్ని చంపడం తప్ప వేరే మార్గం కన్పించలేదు..' అంటూ నిందితులు మీడియా ముందు హత్య జరిగిన వైనంపై సెలవిచ్చారు. 

చెరుకులపాడు నారాయణరెడ్డి కేవలం ఫ్యాక్షనిస్ట్‌ అయితే, ఈ హత్యకి ఇంతకన్నా పెద్ద కారణాలు ఇంకేమీ వుండకపోవచ్చు. కానీ, ఆయన 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, టీడీపీ సీనియర్‌ నేత కేఈ కృష్ణమూర్తి మీద. అప్పట్లో ఆయన కాంగ్రెస్‌లో వుండేవారు, ఆ తర్వాత ఆయన వైఎస్సార్సీపీలోకి వచ్చారు. పత్తికొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఈ నియోజకవర్గంలో బాగా బలం పుంజుకున్నారు కూడా. పైగా, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వర్గంతో నారాయణరెడ్డి వర్గానికి ఫ్యాక్షన్‌ తగాదాలు ఎప్పటినుంచో వున్నాయి. 

అటు ఫ్యాక్షనిజం, ఇటు రాజకీయం.. రెండూ కలగలిశాక, అందునా నారాయణరెడ్డి హత్యపై రాజకీయ ఆరోపణలు వెల్లువెత్తాక.. ఇది జస్ట్‌ ఫ్యాక్షన్‌ హత్య.. అని ఎలా అనుకోగలం.? కానీ, కథ మాత్రం అలాగే వుంటుంది. పరిటాల రవి హత్య కేసులో ఏం జరిగింది.? హత్య చేసిన మొద్దు శీను జైల్లో అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యాడు. హత్య చేయించిన మద్దెలచెరువు సూరి సైతం అనుమానాస్పద స్థితిలోనే హత్యకు గురయ్యాడు. ఆ కథ ఇప్పటికీ పెద్ద మిస్టరీనే. 

ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడాల్లేవిక్కడ. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అన్న వ్యత్యాసం అసలే వుండదిక్కడ. ఫ్యాక్షన్‌, రాజకీయం కలగలిస్తే.. ఆ మారణహోమానికి హద్దూ అదుపూ వుండదనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?

Show comments