అభిమానం అంటే అడుక్కొంటే వచ్చేది కాదు రెడ్డి!

సొంత వాళ్లను కెలికి మరీ తిట్టించుకుంటున్నాడు జేసీ దివాకర్ రెడ్డి. ఇప్పటి వరకూ చాలా సార్లు ‘మా రెడ్లు చంద్రబాబుకు సపోర్ట్ చేయాలి.. జగన్ కు చేయకూడదు..’’ అని చెప్పుకొచ్చిన దివాకర్ రెడ్డి, ఇటీవల కర్నూలు జిల్లాలో ముచ్చుమర్రి ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడిన మాటలు మాత్రం ఎదురుతన్నాయి. ఈ విషయంలో  సోషల్ మీడియా నుంచి వ్యక్తం అవుతున్న భావాన్ని గమనిస్తే.. జేసీకి ‘రెడ్డి’ కులస్తులు సపోర్ట్ చేయడం మాట అటుంచి, ఈయన గత చరిత్రనంతా తవ్వి తీసి… గాలి తీస్తున్నారు!

ఇదే సమయంలో.. జగన్ ను సమర్థిస్తూ కూడా పోస్టింగులు ప్రచురితం అవుతున్నాయి. ‘జగన్ ఏ రోజూ.. నేను రెడ్డిని, నాకు రెడ్డీసంతా ఓట్లేయండి..’ అంటూ అడగలేదు, అభిమానం అంటే అది అడుక్కొంటే వచ్చేది కాదు, అది జనించాలి.. అని దివాకర్ కి ఆయన ‘సొంత’ కులస్తులే నొక్కి చెబుతున్నారు! 

జగన్ నీలా అవకాశ వాది కాదు.. అధికారం ఉన్నన్ని రోజులూ  కాంగ్రెస్ లో, అది చేజారుతుందనుకున్నప్పుడు తెలుగుదేశంలో చేరి.. తన సామ్రాజ్యాన్ని కాపాడుకునే యత్నాలు చేయలేదు. జగన్ చంద్రబాబులాంటి వాడు కూడా కాదు.. అబద్ధాలు, మోసపూరిత  హామీలు ఇచ్చి అధికారాన్ని సంపాదించుకునేయత్నం చేయలేదు.. నీలాంటి అవకాశ వాది కన్నా, చంద్రబాబులాంటి మోసపూరిత వ్యక్తి కన్నా.. జగన్ ఎంతో ఉత్తముడు, అందుకే తమ సపోర్టు జగన్ కు ఉందని జేసీ ‘సొంత’ సామాజికవర్గీయులు పోస్టులు పెట్టి.. ఆయనపై విరుచుకుపడ్డారు!

మొన్నటి వరకూ  అయితే.. అనంతపురం వరకూ, తమ సొంత నియోజకవర్గం తాడిపత్రి వరకూ అయినా జేసీని ఆయన సొంత సామాజికవర్గం వారు సమర్థించేవారు. జేసీ ఏ పార్టీలో ఉన్నా.. వారు తమ సామాజికవర్గానికి చెందిన వాడిగా గుర్తించి, గౌరవించారు. అయితే.. జగన్ పై అవాకులు చవాకుల నేపథ్యంలో జేసీ వారి మద్దతును కూడా కోల్పోయినట్టున్నాడు సుమా!

Show comments