'పచ్చ' వ్యూహం : కోతిపుండును బ్రహ్మరాక్షసి చేద్దాం!

అవకాశం లేకలేక వచ్చింది... దీనిని మాగ్జిమమ్ ఉపయోగించేసుకోవాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉవ్విళ్లూరుతున్నాయి. వైసీపీనుంచి తెదేపాలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మీద దాడి జరిగింది అనే వ్యవహారాన్ని ఎంత పెద్దది చేయగలిగితే అంత పెద్దదిగా రాద్ధాంతం చేయాలని పార్టీ వ్యూహాత్మకంగా కదులుతోంది. పార్టీ వ్యూహకర్తలనుంచి స్థాయీదశల వారీగా శ్రేణులకు పురమాయింపులు కూడా వెళ్లినట్లుగా సమాచారం. ఎమ్మెల్యే అఖిలప్రియ మీద వైఎస్  జగన్మోహన రెడ్డి దాడి చేయించారు.. అనే విషయాన్ని వీలైనంత ఎక్కువగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వారు వ్యూహాత్మకంగా ఉన్నట్లు సమాచారం. 

తెలుగుదేశం పార్టీ మహిళా పక్షపాతి పార్టీ అని ఏదో ఓటు బ్యాంకు కోసం అన్నట్లుగా, దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా  మాటలు అప్పచెప్పడమే తప్ప.. ఇప్పటిదాకా మహిళల మీద రాష్ట్రంలో జరిగిన అకృత్యాల ఘటనలు అన్నీ తెలుగుదేశం పార్టీ వారి ఖాతాలోనివే. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రభుత్వ మహిళా అధికారి మీద చేయిచేసుకోవడం ఓ దారుణం అయితే, మంత్రి రావెల కిశోర్ బాబు, మైనారీటి మహిళ అయిన ప్రజాప్రతినిధిని వేధించడం.. వారి దౌష్ట్యానికి పరాకాష్ట. వీటన్నిటిని మించి.. కాల్‌ మనీ బాగోతాల్లో తెదేపా గూండాలు ఎన్ని దురాగతాలకు పాల్పడినట్లుగా ఎన్నెన్ని ఘటనలు వెలుగుచూశాయో అందరికీ తెలుసు. మహిళల పట్ల అన్ని పాపాలూ తమ ఖాతాలోనే ఉండగా.. ఇన్నాళ్లకు జగన్ మీద కూడా బురద చల్లడానికి ఒక ఛాన్సు వచ్చిందని తెలుగుదేశం నాయకులు మురిసిపోతున్నారట.

ఈ విషయాన్ని ఇంకాస్త పెద్దదిగా చిత్రీకరించాలని అఖిలప్రియకు కూడా సలహా ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. అఖిలప్రియ మాటల్లో నిన్నటికి- ఇవాళ్టికి చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. తన కారు మీద దాడికి ప్రయత్నించారని, అద్దాలు పగులగొట్టడానికి ప్రయత్నించారని, ‘వారు తాగి ఉన్నారక్కా’ అని డ్రైవరు తనతో చెప్పాడని నిన్న (గురువారం) చాలా మెతకగా స్పందించిన భూమా అఖిలప్రియ , శుక్రవారం ఉదయానికెల్లా తన స్వరంలో తీవ్రత పెంచారు. ‘దాడికి ప్రయత్నించారు’ అనే ఆరోపణ స్థానే ఇప్పుడు ‘దాడి చేశారు’ అనే మాట వచ్చేసింది. దాడే జరిగి ఉంటే... అప్పటికప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన గౌరవనీయ ఎమ్మెల్యేకు అప్పట్లో అది స్ఫురించినట్లు లేదు. ఈ కోతిపుండును బ్రహ్మరాక్షసిగా మార్చి.. లబ్ది పొందాలని నిర్ణయించుకున్న తర్వాత.. ఇప్పుడు ఫిర్యాదు చేయడానికి కూడా ఆమె సిద్ధమవుతున్నారు. ఈ ఘటనను, నిందలను వాడుకుంటూ.. వైఎస్ జగన్ ను వీలైనంత బద్‌నాం చేయడానికి ఆమె నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. సీసీ టీవీల ఫుటేజి ఆధారంగా దాడిచేసిన వారిని అదుపులోకి తీసుకున్నాం అంటున్న పోలీసులు.. దాడి జరిగినట్లుగా నిరూపించే ఫుటేజీని మీడియాకు ఎందుకు ఇవ్వడం లేదో.. విపక్షం నోటికి తాళం వేయడానికి ఎందుకు ప్రయత్నించడంలేదో గమనిస్తే చాలు... ఒక కుట్ర పూరిత వ్యూహంతో తెదేపా  ఈ రాద్ధాంతాన్ని పెంచుతున్నట్లుగా అర్థమవుతోంది. 

Readmore!
Show comments