కరుణానిధి.. ‘ఆఖరి’ యత్నాలు?!

దాదాపు నెల నుంచి మీడియా ముందెక్కడా కనిపించలేదు డీఎంకే అధినేత కరుణానిధి. ఒకవైపు ముఖ్యమంత్రి జయలలిత ఆసుపత్రికి పరిమితం అయ్యింది. ఆమె కోలుకుంటున్నారని తొలిరోజు నుంచి ప్రకటిస్తూనే ఉన్నా, ఆమె ఎప్పుడు డిశ్చార్జి అవుతుందనే అంశం గురించి ఎవ్వరికీ స్పష్టత లేదు. ఈ విషయంలో వైద్యులనే అడిగితే.. ‘ఆమె ఎప్పుడు డిశ్చార్జి కావాలనుకుంటే అప్పుడు అవుతుంది..’ అంటూ చాలా తెలివిగా సమాధానం చెబుతున్నారు!

జయ ఆరోగ్య పరిస్థితి గురించి దాపరికాన్ని కొనసాగించడానికే వైద్యులు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని స్పష్టం అవుతోంది. ఇక ఇదే సమయంలో కరుణానిధి దర్శన భాగ్యం కూడా కరువైంది. ఆయన కూడా నెల రోజుల నుంచి ఇంటికే పరిమితం అయ్యాడు. 

ఇప్పటికే 90 దాటేసిన కరుణ ప్రతిపక్ష నేత బాధ్యతల్లో ఉన్నాడు. ఇటు ముఖ్యమంత్రి, అటు ప్రతిపక్ష నేత ఇద్దరూ కనిపించని స్థితి కొనసాగుతోంది తమిళనాట. ఇదిలా ఉంటే.. ఇంటికే పరిమితం అయిన కరుణ ఇప్పుడు తనయుల మధ్య రాజీకి మాత్రం తీవ్రంగానే ప్రయత్నిస్తున్నాడని సమాచారం.

వారి మధ్య రాజీకి కరుణ చేస్తున్నవి ‘ఆఖరి’ యత్నాలు అనే మాట కూడా వినిపిస్తోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందే కరుణ పెద్ద కుమారుడు అళగిరి తండ్రితో విబేధించి దూరం అయిన సంగతి తెలిసిందే. స్టాలిన్ నాయకత్వాన్ని అళగిరి ఒప్పుకోవడం లేదు. అయితే అళగిరి సమర్థత మీద కరుణకు నమ్మకం లేదు. స్టాలినే తనకు తగిన వారసుడని ఆయన నమ్ముతున్నాడు.

ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు వ్యతిరేకంగా పని చేశాడు అళగిరి. అంతకు ముందే అతడిపై బహిష్కరణ వేటు పడింది. తనకు చేతనైనంత స్థాయిలో అళగిరి పార్టీకి నష్టం చేశాడు. ఒకవేళ ఆ ఎన్నికల్లో డీఎంకే గెలిచి ఉంటే.. అళగిరి ప్రస్థానం ఆగిపోయేదేమో, అది జరగలేదు కాబట్టి.. రాజీకి కరుణ, స్టాలిన్ ల వైపు నుంచినే ప్రతిపాదనలు వెళ్లాయి.

దీని కోసం కరుణ ఇళ్లు వేదికగా.. అన్నదమ్ముల మధ్య సమావేశాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. కరుణ ఇద్దరినీ పిలిపించుకుని మాట్లాడుతున్నారట. ఈ సమావేశాలకు డీఎంకే ముఖ్యనేతలు కూడా హాజరై.. అన్నదమ్ములకు సర్ధి చెప్పే యత్నం చేస్తున్నట్టు సమాచారం.

వృద్ధుడైపోయి.. కనీసం బయటకు రాలేని స్థితి లో ఉన్న కరుణానిధి ఇక బాధ్యతలను వారసులకు అప్పగించేయాలని భావిస్తున్నారట. ఈ డిసెంబర్ లో పార్టీ అధ్యక్ష పీఠాన్ని, ప్రతిపక్ష నేత హోదాను స్టాలిన్ కు అప్పగించేయాలనేది ఆయన భావన. అలాగని అళగిరిని పూర్తిగా విస్మరించకుండా.. అతడికి సర్ధి చెప్పే యత్నం కూడా చేస్తున్నట్టున్నాడు. మరి వృద్ధ నేత ప్రయత్నాలకు తనయుల నుంచి ఏ మేరకు సహకరం అందుతుందో చూడాలి!

Show comments