కమ్యూనిస్టులూ...మీకిది ప్రత్యేక వార్త...!

పాఠకులకు ఆసక్తికరమైన ప్రతి అంశమూ మీడియాకు వార్తే. కొన్ని రొటీన్‌ వార్తలను కూడా సమాచారం కోసమో, ఇతర కారణాలవల్లనో ప్రచురిస్తుంటారు. పుణ్య క్షేత్రాలను ప్రతి రోజూ అనేకమంది సందర్శిస్తుంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. సినిమా తారలో, క్రీడాకారులో వచ్చారునుకోండి పాఠకులకు ఆసక్తికరంగా ఉంటుంది. అలాగే న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు మొదలైనవారు దైవదర్శనం చేసుకున్నా ప్రముఖంగా ప్రచురిస్తారు. అది పాఠకాసక్తికరం కాకపోయినా పెద్దలు కాబట్టి గౌరవం ఇస్తారు. ఇవన్నీ సాధారణ వార్తల కింద లెక్క. కాని కొందరు పుణ్య క్షేత్రాలకు వచ్చి దైవ దర్శనం చేసుకుంటే అదొక 'ప్రత్యేక వార్త' అవుతుంది. 

దాని మీద కొంత చర్చ జరుగుతుంది. 'వీరు కూడా దైవ దర్శనం చేసుకుంటారా?'...అని కామెంట్‌ చేసే పరిస్థితి వస్తుంది. ఎందుకలా? అని ప్రశ్నించుకుంటే వీరు 'నాస్తికులు' కాబట్టి. పుణ్య క్షేత్రాలకు వెళ్లడం, దైవ దర్శనం చేసుకోవడం వారి సిద్ధాంతాలకు విరుద్ధం కాబట్టి. అందుకే వీరు దైవ దర్శనం చేసుకుంటే అది ప్రత్యేక వార్త అవుతుంది.  ఇంతకూ అసలు విషయం ఏమిటంటే....ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (సీపీఐ) రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన, ప్రస్తుతం ఆ పార్టీ జాతీయ నాయకుడైన డాక్టర్‌ కె. నారాయణ సంప్రదాయబద్ధంగా తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. 

తిరుమలకు వెళ్లి దైవదర్శనం చేసుకోవడం సామాన్యులకు వ్యక్తిగత విషయం. అది విశేషం కాదు. కాని సీనియర్‌ కమ్యూనిస్టు నాయకుడు నారాయణ (67) తన కుటుంబంతో కలిసి దైవ దర్శనం చేసుకోవడం విశేషమే. ఎందుకంటే కమ్యూనిస్టులు వారి సిద్ధాంతం ప్రకారం దేవుడి ఉనికిని విశ్వసించారు. పూర్తిగా భౌతికవాదులు. వీరినే సాధారణంగా నాస్తికులు అంటుంటాం. దేవుడిని నమ్మనప్పుడు ఆలయాలకు వెళ్లే ప్రశ్నే లేదు కదా. సాధారణ కార్యకర్తలు ఎవరైనా వెళ్లవచ్చేమోగాని కీలక పదవుల్లో నాయకులు వెళ్లరు. అలా వెళితే సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరించినట్లవుతుంది. 

పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రశ్నించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అందుకే హార్డ్‌కోర్‌ కమ్యూనిస్టులు ఆలయాల ఛాయలకు అసలే వెళ్లరు. తన పనులతో సంచలనాలు రేపే నారాయణ మరోసారి చర్చనీయాంశమైన పని చేశారు. ఇక నారాయణ తిరుమలకు తన జీవితంలో మొదటిసారిగా వెళ్లడం విశేషం. కుటుంబ సభ్యుల కోరిక మేరకు దైవ దర్శనం చేసుకున్నానని  మీడియాకు చెప్పారు. దీన్నిబట్టి కుటుంబ సభ్యులు కమ్యూనిస్టులు కాదని అనుకోవచ్చు.  కరుడుగట్టిన కమ్యూనిస్టులు సిద్ధాంతాలను గట్టిగా పాటిస్తుంటారు. వారిలో ఎవరైనా అందుకు భిన్నంగా వ్యవహరిస్తే చర్చనీయాంశమవుతుంది. 

కొంతకాలం క్రితం ఓ టీవీ ఛానెల్‌ నారాయణను, సీపీఎం నాయకుడు బీవీ రాఘవులును కలిపి ఇంటర్వ్యూ చేసింది. అందులో నారాయణ మాట్లాడుతూ తాను పదో తరగతి వరకు వీర భక్తుడినని, ఆ తరువాత సీపీఐ అనుబంధ విద్యార్థి సంఘం ఏఐఎస్‌ఎఫ్‌లో, తరువాత సీపీఐలో చేరిన తరువాత పూర్తి నాస్తికుడిగా మారానన్నారు. ఇన్నేళ్ల తరువాత కుటుంబ సభ్యుల కోరికను మన్నించి తిరుమలకు వెళ్లారు. ఎంత కమ్యూనిస్టు లీడరైనా కుటుంబ సభ్యులను సంతోషపెట్టడమూ ముఖ్యమే కదా....! కాని కొందరు అసలు రాజీపడరు. ఇక రాజకీయంగా కూడా నారాయణ కాస్త భిన్నంగా ఉంటారు.  

కమ్యూనిస్టు నాయకుడైనా సాధారణ బూర్జువా పార్టీ నాయకుడిగానే వ్యవహరిస్తుంటారు.  సాధారణంగా కమ్యూనిస్టు నాయకులు ఇతర పార్టీల నాయకుల మాదిరిగా 'సొల్లు వాగుడు' వాగరు. అశ్లీలంగా మాట్లాడటం, విపరీతంగా దూషించడం...మొదలైనవి చేయరు. ఎంతసేపటికీ విధానాల పైనే మాట్లాడుతుంటారు. కాని నారాయణ తీరు వేరుగా ఉంటుంది.  నోరు అదుపులో పెట్టుకోలేరు. అది ఆయన బలహీనత. ఎంత మాట బడితే అంత మాట అంటారు. ప్రధాని నుంచి రాష్ట్ర నాయకుడి వరకు ఎవ్వరి మీదైనా సరే వ్యంగ్య, పరుష వ్యాఖ్యలు చేస్తారు. ఒకసారి ప్రధానిని ఉరి తీయాలన్నారు. 

వైఎస్‌ రాజశేఖర రెడ్డి  హయాంలో  ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి అవినీతి ఆరోపణలు ఎదుర్కొని  జైల్లో  ఉన్నప్పుడు ఆమె అందాన్ని పొగుడుతూనే  అవినీతిని ఎండగట్టారు. ఒకసారి  మాజీ మంత్రి గీతా రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసి దళిత సంఘాలు ఆగ్రహించడంతో  లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పారు. నారాయణ నోటి దురుసుపై  ఓసారి పార్టీ సమావేశంలో ఘాటు చర్చ జరిగిందని, సభ్యులు ఆయనకు 'తలంటి' పోశారని వార్తలు వచ్చాయి. ఇక నుంచి తాను నోరు అదపులో ఉంచుకుంటానని చెప్పారట...! ఓసారి గాంధీ జయంతినాడు చికెన్‌ తిని, అది చర్చనీయాంశం కావడంతో ఏడాదిపాటు తనకు తానే నిషేధం విధించుకున్నారు. ఏదిఏమైనా నారాయణ కల్లాకపటం ఎరుగని నాయకుడని చెప్పొచ్చు. 

Show comments