పవన్‌కళ్యాణ్ కొత్త సినిమా 'కాటమరాయుడు' టీజర్ బయటకొచ్చింది.. వస్తూనే, యూ ట్యూబ్‌లో సంచలనాలు షురూ చేసేసింది. తమిళ సినిమా 'వీరం'ని మక్కీకి మక్కీ దించేశారనే వాదనల సంగతెలా వున్నా, తమ అభిమాన హీరో పవర్‌ఫుల్ రోల్‌లో కన్పిస్తుండడంతో, అభిమానులు యూ ట్యూబ్‌లో టీజర్‌కి బ్రహ్మరథం పట్టేస్తున్నారు.
నిన్న సాయంత్రం విడుదలైన టీజర్, ఈ రోజు తెల్లవారేసరికి 27 లక్షల వ్యూస్ రాబట్టేసుకుంది. ఈ మధ్యకాలంలో యూ ట్యూబ్ వ్యూస్ కూడా 'రికార్డుల' కౌంట్‌లోకి వచ్చేస్తున్న విషయం విదితమే. ఫస్ట్ డే యూ ట్యూబ్ వ్యూస్ రికార్డుల్ని 'కాటమరాయుడు' కొల్లగొట్టేస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.
మరోపక్క, నిర్మాత శరత్‌మరార్ ఇదే జోష్‌లో సినిమా ప్రమోషన్‌ని ఉధృతం చేయాలనుకుంటున్నారట. మేకింగ్ వీడియో, సాంగ్ టీజర్స్.. ఇలా ఒకదాని తర్వాత ఒకటి యూ ట్యూబ్‌లోకి వచ్చేయనున్నాయి. ఆడియో ఫంక్షన్ల స్థానంలో కొత్తగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ట్రెండీగా మారిపోవడంతో, 'కాటమరాయుడు'కి కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయనున్నారని తెలుస్తోంది.
ఇదిలా వుంటే, 'కాటమరాయుడు' తమిళ 'వీరం'కి రీమేక్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా. అజిత్, తమన్నా జంటగా నటించారు ఆ సినిమాలో. తెలుగులో పవన్‌కళ్యాణ్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. 'గోపాల గోపాల' ఫేం డాలీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.