వెటరన్ నటుడి ఆవేధనను పట్టించుకునేదెవరు?

‘ఎంతైనా సినిమా వాడిని.. సినిమా ఫంక్షన్స్ కు వెళ్లాలని నాకు మాత్రం ఉండదా.. సినిమా ప్రివ్యూలకు వెళ్లాలని ఉంటుంది, అవార్డుల ఫంక్షన్లకు ఉండాలనీ ఉంటుంది.. అయితే ఎవరూ పట్టించుకునే వారు లేరు. పిలిస్తే వెళ్లడానికి నేను ఉత్సాహంగానే ఉన్నాను..’ అంటూ అచ్చం చిన్న పిల్లాడిలా తను కోరికను వ్యక్త పరిచారు వెటరన్ యాక్టర్ కైకాల సత్యనారాయణ. సినిమాపై తనలో మమకారం ఏ మాత్రం తగ్గలేదని ఆయన తన మాటలతో చెప్పకనే చెప్పారు. మరి తెలుగు చిత్ర పరిశ్రమ సీనియర్స్ లో సత్యనారాయణ సమవయస్కులు ఎవరూ లేరు. మిగిలింది ఈయన ఒక్కరే. మరి ఇలాంటి వ్యక్తిని కూడా తెలుగు చిత్ర పరిశ్రమ తగురీతిలో గౌరవించలేకపోతోంది.

అయినా.. అవార్డుల కార్యక్రమాల తీరు ఏమిటో ఇప్పటికే పలు దఫాలుగా చర్చకు వచ్చింది. ఊపు మీదున్న హీరోలను ఆ కార్యక్రమాలకు పిలవడం.. వచ్చిన వారికి అవార్డులు ఇవ్వడం, రాని వారితో మాకేం అవసరం అన్నట్టుగా వ్యవహరించడం. ఇదీ ప్రస్తుతం జరుగుతున్న అవార్డు ప్రదానోత్సవాల తీరు. పక్కా వ్యాపార దృక్పథంతో అవార్డులను పంచుతున్న వారు.. వెటరన్స్ కు ఏం గౌరవం ఇస్తారు?

అలాగే మరో అంశంపై కూడా ఒకింత నిరాశ వ్యక్తం చేశారు సత్యనారాయణ. వెనుకటికి ఏపీలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం  సత్యనారాయణ పేరును పద్మశ్రీ కి సిఫార్సు చేసినా.. కేంద్రంలోని కాంగ్రెస్ వాళ్లు మాత్రం ఆయనకు అవార్డు ను ఇవ్వడానికి నిరాకరించారట. తెలుగుదేశం పార్టీలో పని చేసిన సత్యనారాయణకు మనహయాంలో పద్మ పురస్కారం ఇవ్వడం ఏమిటి? అని అప్పటి కేంద్ర హోం శాఖ ప్రశ్నించిందట. మరి ఏపీ కాంగ్రెస్ నేతలు సత్యనారాయణ ను పార్టీ పరంగా చూడకపోయినా.. ఢిల్లీ వాళ్లు మాత్రం ఈయనను తెలుగుదేశం వ్యక్తి కింద లెక్కేశారు.

మరి ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో తెలుగుదేశం భాగస్వామి అయిన ఎన్డీయే అధికారంలో ఉంది. కనీసం ఇప్పుడైనా ఈ వెటరన్ కు తగిన పురస్కారం ఇస్తే మంచిదే. తెలుగుదేశం వాళ్లు అయినా సత్యనారాయణను ఓన్ చేసుకుంటారని ఆశిద్దాం. 

Show comments