ఒకసారి దొరికిన వ్యక్తి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పొచ్చు.. అనుదినమూ ఇదే పనైతే.. ప్రతి రోజూ ప్రహసనమే అయితే ఎలా? అంటే అన్నమాంటారు... కానీ, ఆయన తీరు మాత్రం మరీ కామెడీ కామెడీగా తయారవుతోంది. అయినా.. మరీ ఇంత సిల్లీగా ఏమిటండీ బాబూ! లోకేష్ ‘పొరపాట్ల’ పరంపరలో మరోటి వచ్చి చేరినట్టుంది. ఆయన నోటి జారుడు కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే అనేక వీడియోలు స్ట్రీమ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోటి ఇప్పుడు ఫేస్ బుక్ లో షేరింగులకు నోచుకుంటోంది. గతంలో లోకేష్ బాబు..‘అవినీతి, కులపిచ్చి, మతపిచ్చి ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశమే..’ అనడం, ‘పొరపాటును సైకిల్ గుర్తుకు ఓటేస్తే.. ఉరేసుకున్నట్టే..’ అనడంతో మొదలుపెట్టి.. ఇటీవల ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంలో ఆ పదాలు తిరక్క అవస్థలు పడటం, అలాగే అంబేద్కర్ జయంతి రోజున వర్ధంతి అంటూ శుభాకాంక్షలు తెలపడం.. ప్రత్యర్థులకు అస్త్రాలుగా మారాయి.
లోకేష్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించడానికి వైకాపా వారికి ఆయన ప్రసంగాలే ఆధారాలయ్యాయి. ఈ నేఫథ్యంలో నెల్లూరులో జరిగిన ఒక కార్యక్రమంలో లోకేష్ ప్రసంగానికి సంబంధించిన వీడియో ఒకటి ఫేస్ బుక్ లో వైరల్ అయ్యింది. ఆ కార్యక్రమంలో లోకేష్ ఏమన్నారంటే..‘ఏదీ చెప్పమనండీ... జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న పదేళ్ల కాలంలో రాష్ట్రానికి ఏయే ప్రాజెక్టులు వచ్చాయో..?’ అంటూ లోకేష్ ఆవేశంగా ప్రశ్నించారు. మరి జగన్ మోహన్ రెడ్డి ఇంత వరకూ సీఎం కాలేదని వేరే చెప్పనక్కర్లేదు. అయితే లోకేష్ మాత్రం.. ‘జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న పదేళ్లలో ఏ ప్రాజెక్టులు వచ్చాయి?’ అని ప్రశ్నించారు. లోకేష్ అవగాహన లేమి ఏ స్థాయిలో ఉందో... ఆయన ఏం ఆలోచిస్తూ.. మరేం మాట్లాడతారో.. అర్థం చేసుకోవడానికి ఇలాంటి వీడియోలు దర్పణంగా మారుతున్నాయి. ఇలాంటి వ్యక్తి ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖలు, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ‘అద్భుతం’గా ఉంటుంది కదా!