ఒకరి గుట్టు మరొకరు విప్పుకుంటూ...

వెనకటికి ఓ కథ ఉంది.

అనగనగా ఓ ముసలమ్మ ఉన్న ఇంటిలో ఒక రాత్రి పూట నలుగురు దొంగలు పడ్డారు. ఇంట్లో ఉన్న నగలూ నట్రా, డబ్బూ దస్కం మొత్తం చక్కబెట్టేస్తుండగా... అర్ధరాత్రి అలికిడికి ముసలమ్మ నిద్రలేచింది. ఈలోగా నలుగురూ దొంగలూ తలోవైపు నక్కి దాక్కున్నారు. ఒకడు తలుపు చాటున చేరాడు. మరొకడు బీరువా వెనకల నక్కాడు. ఒకడు దూలం ఎక్కి దాని పైన పడుకున్నాడు. మరొకడు మంచం కింద చేరాడు. ముసలమ్మ దొంగలు పడిన సంగతిని గుర్తించి పొలికేకలు పెట్టేసరికి ఇరుగు పొరుగు నలుగురూ గుమికూడారు. 

అందరితో రాగాలుతీస్తూ.. దొంగలుపడ్డ వైనం గురించి వివరించసాగింది ముసలమ్మ. ‘‘ఎందరు దొంగలొచ్చారమ్మా’’ అని అడిగితే... ‘‘ఏమో అంతా ఆ పై వాడికే తెలియాలి’’ అన్నది ముసలమ్మ. ‘ఏమేం దోచుకున్నారమ్మా’ అంటే ‘‘ఏమో అంతా ఆ పై వాడికే తెలియాలి’’ అన్నది. ‘‘ఎలా వచ్చారమ్మా’’ అంటే ‘‘ఏమో అంతా ఆ పై వాడికే తెలియాలి’’ అంటున్నది. ఇలా ఎవరేం ప్రశ్న అడిగినా.. ‘‘ఏమో అంతా ఆ పై వాడికే తెలియాలి’’ అనసాగింది ముసలమ్మ. 

ఈ తంతు చూసి.. పైన దూలం మీద పడుకున్న దొంగకు కోపం వచ్చింద. వాడు గభాల్న కిందికి దూకి.. ముసలమ్మ మీద రంకెలు వేశాడు. ‘‘ప్రతిదానికీ పైవాడికే తెలియాలి అంటున్నావే.. అన్నీ నాకేనా తెలిసింది... ఆతలుపుచాలున ఉన్నవాడు, మంచం కింద ఉన్నవాడు, బీరువా వెనక నక్కినవాడు నీ చుట్టాలా...’’ అంటూ కోప్పడిపోయాడు. అక్కడి జనం దాగిన దొంగలందర్నీ పట్టుకుని చితకతన్ని పంపించారు.

ఇదీ కథ!!
==

ఇప్పుడు డ్రగ్స్ వ్యవహారంలో ఇరుక్కున్న టాలీవుడ్ ప్రముఖుల పరిస్థితి కూడా అదే తరహాలో సాగిపోతున్నది. ఇప్పటికే డ్రగ్స్ రాకెట్ తో సంబంధాలు ఉన్న పలువురు సినీ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చేశాయి. వారిని మీడియా విలేకర్లు స్పందన కోసం సంప్రదిస్తూనే ఉన్నారు.  ఇలాంటి సమయాల్లో.. ‘తమకేమీ సంబంధం లేదని’ చెప్పుకుంటున్న ప్రతి సినీ ప్రముఖుడూ... ‘ఆఫ్ ది రికార్డ్’ అంటూ.. ‘‘నన్ను మాత్రం అడుగుతున్నారే.. ఫలానా ఫలానా వాళ్ల పేర్లన్నీ ఆ కాల్ లిస్టులో ఉన్నాయి... వాళ్ల పేర్లు ఎందుకు బయటకు రావడం లేదు? వారిని ఎందుకు ప్రశ్నించడం లేదు?’’ అంటూ గుట్టు బయటపెట్టేసుకుంటున్నారు. 

మొత్తానికి సినీ ప్రముఖులు ఒకరి సీక్రెట్లు ఒకరు లీక్ చేసేస్తూ.. మొత్తం ఇండస్ట్రీ పరువును  కూడా రచ్చకీడ్చేస్తున్నారనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయినా.. డ్రగ్స్ తీసుకోవడం వంటి దుర్మార్గపు పోకడకు బానిసలైన తర్వాత.. ఇంకా సుద్దులు చెప్పినా... విలువ ఉండదని అంతా అనుకుంటున్నారు. అలాగే ఈ కేసులో నిగ్గుతేలి అరెస్టులకు దగ్గరగా ఉన్న ప్రముఖులు.. ఆ పరిస్థితే వస్తే గనుక.. తమతో పాటూ మరింత మంది కటకటాల్లోకి వెళ్లేలా అందరి రహస్యాలూ బయటపెట్టేసే ఉద్దేశంతోనే ఉన్నట్లుగా కనిపిస్తోంది.

Show comments