బాహుబలి-2కు మరో అరుదైన గౌరవం

ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయిన బాహుబలి-2 సినిమా మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమాను ప్రారంభ చిత్రంగా ప్రదర్శించనున్నారు. ఫిలిం ఫెస్టివల్ ఓపెనింగ్ రోజు వచ్చే ఆహూతులు అందరికీ బాహుబలి-ది కంక్లూజన్ చిత్రాన్ని ప్రత్యేకంగా చూపించబోతున్నారు.

ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో బాహుబలి-2ను ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈమధ్యే ముగిసిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో బాహుబలి-2 స్పెషల్ స్క్రీనింగ్ వేశారు.

కొన్ని రోజుల కిందట రొమేనియాలో కూడా ఈ సినిమాను ప్రదర్శించారు. ఇప్పుడు మాస్కోలో కూడా సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ గా ప్రదర్శితం కానుంది బాహుబలి-2 సినిమా. ఈ నెల 22 నుంచి 29 వరకు ఈ చిత్రోత్సవం జరుగుతుంది.

బాహుబలి-ది కంక్లూజన్ సినిమా రేపటితో 50 రోజులు పూర్తిచేసుకోబోతోంది. ఇప్పటికే ఈ సినిమా దేశవ్యాప్తంగా కళ్లుచెదిరే రికార్డులు కొల్లగొట్టింది. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవడంతో పాటు.. బాలీవుడ్ నంబర్ వన్ మూవీగా అవతరించింది.

ఏపీ, తెలంగాణలో ఇప్పటికీ 50 శాతం ఆక్యుపెన్సీతో కొనసాగుతుండడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ సినిమాకు 1680 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది.

Show comments