'రాజకీయాల్లో వ్యక్తిగత అభిప్రాయాలకు చోటుండదు..'
- కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు ఉవాచ ఇది.
చాలా సందర్భాల్లో 'వ్యక్తిగత అభిప్రాయం' చెప్పేందుకు వెంకయ్య ససేమిరా అంటారు. 'పార్టీ అభిప్రాయమే నా అభిప్రాయం.. పార్టీ అభిప్రాయాన్ని కాదని, వ్యక్తిగత అభిప్రాయాల్ని నేను వెల్లడించను..' అని వెంకయ్య చెప్పడం చాలా సందర్భాల్లో చూశాం. కానీ, ఆయనకీ వ్యక్తిగత అభిప్రాయాలుంటాయి.. అవి పార్టీకి సంబంధం లేని అభిప్రాయాలు. అవును, తప్పించుకోడానికి ఇదొక మార్గం మరి.!
వెంకయ్యనాయుడు మాత్రమే కాదు, బీజేపీకే చెందిన మరో ముఖ్య నేత విష్ణుకుమార్‌రాజుకీ వ్యక్తిగత అభిప్రాయాలున్నాయి. అవీ పార్టీతో సంబంధం లేని అభిప్రాయాలే. 'నా వ్యక్తిగత అభిప్రాయమైతే ఇదీ.. పార్టీ నిర్ణయం మాత్రం నాకు తెలియదు.. పార్టీ తరఫున నేను మాట్లాడను..' అని సెలవిచ్చారు విష్ణుకుమార్‌రాజు.
ఇంతకీ, విషయమేంటంటే పార్టీ ఫిరాయింపుల అంశంపై రచ్చ జరుగుతున్న దరిమిలా, మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలకు బీజేపీ నేతలు.. అందునా, బీజేపీలోని చంద్రబాబు భజన బృందం తెగ ఇదయిపోతోంది. ఆ గందరగోళంలో తామేం మాట్లాడుతున్నామో తెలియని అయోమయంలో పడిపోతున్నారు. పార్టీ ఫిరాయింపుల్ని ఖండిస్తారు, చంద్రబాబుని మాత్రం పొగిడేస్తుంటారు. మిత్రపక్షంగా చంద్రబాబు చర్యల్ని ప్రశ్నించలేరట. కానీ, వ్యక్తిగతంగా తమ అభిప్రాయాలుచెప్పేస్తారట. ఇదేమి వైపరీత్యం.? ఏ సందర్భంలో అయినాసరే, తిమ్మిని బమ్మిని చేసేసే వెంకయ్యనాయుడే, తడబాటు ప్రదర్శిస్తున్నప్పుడు.. విష్ణుకుమార్‌రాజు ఆ మాత్రం తడబడకపోతే ఎలా.?
బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి పురంధరీశ్వరి ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయింపులపై ఆక్షేపణ వ్యక్తం చేస్తూ, ప్రధాని నరేంద్రమోడీకీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకీ లేఖాస్త్రం సంధించిన విషయం విదితమే. ఈ వ్యవహారంపై విష్ణుకుమార్‌రాజు, 'పర్సనల్'గా స్పందించారు. 'ఆ లేఖ ఆమె వ్యక్తిగతం కావొచ్చు.. అయినా, ఆమె ఉన్న మాటే అన్నారు కదా..' అంటూ, తన వ్యక్తిగత అభిప్రాయాన్నీ చెప్పేశారు. 'నేనే గనుక ముఖ్యమంత్రినైతే, ఇతర పార్టీల నుంచి వచ్చే ప్రజా ప్రతినిథుల్ని ముందుగా రాజీనామా చేయమంటాను..' అంటూ హడావిడి చేసిన విష్ణుకుమార్‌రాజు, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమనీ, పార్టీ పరంగా తానేమీ వ్యాఖ్యానించలేనని తేల్చేశారు.
అసెంబ్లీలో విష్ణుకుమార్‌రాజు తీరు 'అపరిచితుడు'ని తలపించేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా. చంద్రబాబు సమక్షంలో ఒకలా, చంద్రబాబు లేనప్పుడు ఇంకోలా వ్యవహరిస్తుంటారాయన. చంద్రబాబు సమక్షంలో, ఆయన భజనలో మునిగి తేలుతుంటారు విష్ణుకుమార్‌రాజు. చంద్రబాబు లేనప్పుడు మాత్రం, 'పెద్దమనిషి' తరహాలో అధికార పక్షానికీ, ప్రతిపక్షానికీ మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తున్నట్లు.. హడావిడి చేస్తుంటారాయన.
మొత్తమ్మీద, బీజేపీ నేతలు ఎందుకో చంద్రబాబు పార్టీ ఫిరాయింపుల తీరుని ఖండించడానికి తెగ మొహమాటపడిపోతున్నారు. అంత వీక్ పాయింట్ వీళ్ళ దగ్గర చంద్రబాబు ఏం గుర్తించి, అది 'అదిమి పెట్టారో' ఎవరికీ అర్థం కాని విషయంగా మారిపోయింది.