జగన్‌కు ఓట్లు పడకుండా బాబు 'గుదిబండ ప్లాన్‌'

ఒకవైపు వైఎస్‌ జగన్మోహన రెడ్డి మరో రెండేళ్లలో ఈ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని, తాను ముఖ్యమంత్రిని అవుతానని జనంతో చెబుతూ ఉంటారు. మరోవైపు నారా చంద్రబాబునాయుడు మరో ముప్పయ్యేళ్లపాలూ తానే ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని కలగంటూ ఉంటారు. అయితే ప్రజల విచక్షణ ఏమిటి? ఏది ఏమైనప్పటికీ రాబోయే ఇరవయ్యేళ్ల పాటూ రాష్ట్ర ప్రజలు జగన్‌కు ఓటు వేయడానికి భయపడేలా, తెలుగుదేశం పార్టీకి తప్ప మరెవ్వరికి ఓటు వేసినా రాష్ట్రం సర్వనాశనం అయిపోయేలా.. చంద్రబాబునాయుడు ఓ ''గుదిబండ ప్లాన్‌'' ను సిద్ధం చేశారు.

 రాజకీయాల్లో కుట్ర పూరిత చాణక్య నీతులకు పేరుమోసిన రాజకీయ అనుభవం ఆయనతో ఈ కొత్త ఎత్తుగడకు పునాది వేయించినట్లున్నది. రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల స్వేచ్ఛను, నిర్ణయాధికారాన్ని 'పాయింట్‌ ఆఫ్‌ నో రిటర్న్‌' దగ్గర పెట్టి వారితో బలవంతంగా తమకే ఓట్లు వేయించుకునేలా ప్లాన్‌ చేసిన ఈ పద్ధతి పేరే 'స్విస్‌ చాలెంజ్‌'. చంద్రబాబు నాయుడు మంత్రి వర్గం శుక్రవారం నాడు భేటీలో ఆమోదించిన అవతలి వారి షరతులను జాగ్రత్తగా గమనిస్తే ఈ విషయం బోధపడుతుంది. వివరాల్లోకి వెళితే... 

స్విస్‌ఛాలెంజ్‌ అంటూ ఒక పేరు పెట్టి సింగపూర్‌ కంపెనీలకు అమరావతి ప్రాంతాన్ని ధారాదత్తం చేసేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమైపోయిన సంగతి అందరికీ తెలిసిందే. రాజధాని భూముల్లో 52 శాతం సింగపూర్‌ కంపెనీలకు, 48 శాతం మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి పంచుకునేలా ఒప్పందాలు చేసుకోబోతున్నారు. అయితే ఇందులో మరో మెలిక ఉంది. భవిష్యత్తులో రాష్ట్రంలో ప్రభుత్వం మారి, ఒప్పందం రద్దు చేస్తే గనుక తమకు భారీ మొత్తంలో నష్టపరిహారం చెల్లించాలంటూ సింగపూర్‌ కంపెనీలు ఓ నిబంధనను ఈ ఒప్పందంలో చేర్చబోతున్నాయి. 

చంద్రబాబునాయుడు టీం మొత్తానికి ఈ నిబంధన మహా రుచించినట్లుగా ఉంది. ఎగిరి గంతేసి దానికి ఒప్పుకున్నారు. అంటే భవిష్యత్తులో ''మమ్మల్ని తప్ప ఈ రాష్ట్రంలో మరెవ్వరిని మీరు గెలిపించినా, మా దందాలను వారు ప్రశ్నించినా.. భారీ పెనాల్టీ కట్టవలసి ఉంటుంది'' అని చంద్రబాబునాయుడు ప్రజలను హెచ్చరిస్తున్నట్లుగానే ఉంది. ప్రజలకు గత్యంతరం లేని పరిస్థితిని ఆయన కల్పిస్తున్నారని జనం అనుకుంటున్నారు. సింగపూర్‌ కంపెనీలు భారీ పెనాల్టీ గురించి ప్రతిపాదించగానే... అది చాలా న్యాయబద్ధమైన ప్రతిపాదన అని మురిసిపోతూ కేబినెట్‌ ఆమోదించడం విశేషం. 

అయినా... ఒక రాష్ట్రంలో రాజకీయ ప్రభుత్వం ఉన్నప్పుడు.. ఎన్నికలు వచ్చినప్పుడు ఆయా ప్రభుత్వాలు మారడానికి పుష్కలంగా అవకాశం ఉంటుంది. కొత్తగా ప్రభుత్వాలు ఏర్పడినా సరే.. స్వతంత్రించి నిర్ణయాలు తీసుకోకుండా ఉండేలా.. అసలు కొత్త ప్రభుత్వాలు ఏర్పడకుండానే ఉండేలా.. ఈ కుట్రపూరిత నిబంధన ఒప్పందంలోకి రావాలనే ఆలోచన అసలు సింగపూర్‌ కంపెనీలకు వచ్చినదేనా... లేదా, చంద్రబాబునాయుడే ఆ ఆలోచనను ఆ కంపెనీల మెదళ్లలోకి చొప్పించారా అని కూడా జనం అనుకుంటున్నారు.

Show comments