బాబు.. మాటకు కట్టుబడతారా? ఎదురుదాడేనా?!

సదావర్తి స్కామ్ విషయంలో తాము చేసిన ఛాలెంజ్ కు చంద్రబాబు అండ్ కో నిలబడగలదా? ఆ సత్రం భూముల విషయంలో ఎలాంటి స్కామూ జరగలేదు.. అని వాదించడానికి తెలుగుదేశం వాళ్లు ఇన్ని రోజులూ ఒక వాదన వినిపించారు. వెయ్యి కోట్ల పై విలువ ఉన్న భూములను కేవలం 22 కోట్ల కే కొట్టేశారు అనే ఆరోపణపై  కొన్న వాళ్లు, తెలుగుదేశం అధినేత ఒక సవాలు విసిరాడు. ఆ భూముల విలువ 22 కోట్ల రూపాయలకు మించి చేయదు.. అంటూ, ఆ ఇరవై రెండు కోట్ల కు మించి డబ్బులు ఇస్తే వాటిని ఆ డబ్బులిచ్చిన వారికే భూములను రాసిస్తామని.. ఆ భూములను కొన్న వ్యక్తి తో పాటు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా బహిరంగ సవాల్ చేస్తూ వచ్చారు!

22 కోట్ల రూపాయలకు అదనంగా ఐదు కోట్ల రూపాయలు ఇస్తే.. సదావర్తి భూములను రాసిస్తామని బాబు మీడియా ముఖంగా సవాల్ చేశాడు. మరి ఇప్పుడు దీనికి బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. ఏకంగా మూడు కంపెనీలు ఆ ఛాలెంజ్ కు స్పందిస్తున్నట్టుగా ప్రకటించాయి. 22 కోట్ల రూపాయలకు అదనంగా ఐదు కోట్ల రూపాయలు  చెల్లించడానికి సిద్ధమని, ఆ భూములను తమకు రాసివ్వాలని ఆ కంపెనీలు ఏపీ ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు పెట్టాయి.

మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? తాము విసిరిన సవాల్ కు స్పందనగా వచ్చిన ఈ ప్రతిపాదనలకు చంద్రబాబు ప్రభుత్వం విలువని ఇస్తుందా? ఇది వరకూ ఛాలెంజ్ విసిరిన కొనుగోలుదారు ఈ ప్రతిపాదనలపై స్పందిస్తాడా? స్వయంగా బాబు చెప్పిన ‘ఐదు కోట్ల అదనం’ ప్రతిపాదనే వచ్చింది కాబట్టి.. తాము చేసిన ఛాలెంజ్ మేరకు ఆ భూములను ప్రతిపాదిత సంస్థలకు అప్ప జెప్పుతారా? లేక పాత ఛాలెంజ్ తో తమకు సంబంధం లేదని ఇప్పుడు కొత్త వాదన మొదలుపెడతారా?

సదావర్తి స్కామ్ గురించి ఎవరు మాట్లాడినా.. ఇన్ని రోజులూ ఛాలెంజ్ తప్ప మరేం చేయలేదు పచ్చచొక్కాలు. తాము చేసే ఆ ఛాలెంజే  తమ నిజాయితీకి నిరూపణగా చెప్పుకొచ్చారు. మరి ఇప్పటి వరకూ అయితే.. వీళ్లలో ఎవరి నుంచి కూడా ఐదు కోట్ల ప్రతిపాదన గురించి మాట పెగలడం లేదు. మరి ఇక ఎదురుదాడి మొదలుపెడతారేమో! ఆ కంపెనీల వెనుక జగన్ ఉన్నాడు, వెయ్యి కోట్ల విలువైన భూములను 27 కోట్లకే జగన్ కొట్టేయాలని చూస్తున్నాడు.. అంటూ వాదించే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి.

Show comments