బాబు ఏం చేస్తున్నారో.. అర్థమవుతోందా?

చంద్రబాబు ప్రభుత్వం, ఆయన, ఆయన మంత్రులు, ఆయన అధికారులు విశాఖలో తెగబడి, తెగించి, నవ్వి పోదురు గాక మాకేటి అనే రీతిలో పాటిస్తున్న దమన నీతిని చూస్తుంటే..అసలు ఏం జరుగుతోంది? ఈ రాష్ట్రంలో? అసలు ఎవరికైనా పడుతోందా? అసలు వారు చేస్తున్న పని వారికైనా అర్థమవుతోందా? అనిపిస్తోంది.

ప్రజాస్వామ్యంలో నిరసన తెలియచేయడం అన్నది ప్రాధమిక హక్కు. అలాంటి నిరసన ప్రభుత్వానికి నచ్చనిది అయితే అడ్డుకోవడం అన్నది కూడా ప్రతి ప్రభుత్వం చేసేదే. పైగా ఇలాంటి నిరసన కార్యక్రమాల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయన్నా కూడా ప్రభుత్వం జోక్యం చేసుకుని అడ్డుకుంటుంది.  కానీ విశాఖలో ఏం జరుగుతోంది?

విశాఖలో జనసేన కావచ్చు, వైకాపా కావచ్చు తలపెట్టిన నిరసన దేని కోసం? ఎవరి కోసం? ఈ రాష్ట్రానికి ఇస్తామని మాట ఇచ్చిన ప్రత్యేక హోదా ఇవ్వమని అడగడం కోసం. అది కూడా ఎవరిని? కేంద్రాన్ని?

మరి దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతోంది? అంటే హోదా అడగడం అన్నది రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టంలేదా? లేదూ విశాఖలో నిరసన వల్ల రైళ్లు ఆగిపోయాయా? బస్సులు ఆగిపోయాయా? దుకాణాలు బంద్ చేసి జనాలను ఇబ్బంది పెడుతున్నారా? లేదా ప్రభుత్వ ఆస్తులపై రాళ్లు రువ్వుతున్నారా? 

ఇవేవీ కాదే? కేవలం వాళ్లు వెళ్లి ఓ ప్రదేశంలో నిరసన, అది కూడా మౌనంగా తెలుపుతామన్నారు. మరి ఎందుకు అడ్డుకోవడం? అడ్డుకోవాల్సిన అగత్యం ఏమిటి? పోనీ ఈ ప్రదర్శన చేస్తున్నవాళ్లు ఏమైనా నిషేధిత గ్రూప్ నకు చెందిన నక్సలైట్లా? కాదే. మరి ఎందుకు అడ్డుకోవడం? అది కూడా ఇంత రాక్షసంగా, పైశాచికంగా? 

అంటే తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్షంలో వున్నపుడు ఎప్పుడూ ఏ నిరసన కార్యక్రమం నిర్వహించలేదా? అప్పుడు ఇలాగే జరిగిందా?ప్రజల ప్రాధమిక హక్కులను. సైతం కాలరాసేంత స్థితికి ఈ ప్రభుత్వం ఎందుకు దిగజారిపోవాల్సి వచ్చింది?

అవునులెండి..కరెంటు చార్జీలు తగ్గించమని అడిగితే కాల్పులు జరిపిన వాళ్లు, అన్నం పెట్టే రైతుపై లాఠీ ఎత్తిన వాళ్లు, జీతాలు ఇవ్వమని అడిగిన అంగన్ వాడీ ఆడపడుచులను గుర్రాలతో తొక్కించిన వాళ్లు, ఇంతకన్నా గొప్పగా ఏం చేస్తారు? అంతకన్నా విశాల దృక్పధంతో ఎలా ఆలోచిస్తారు.

Show comments