ఫ్లాప్ ముద్ర వేస్తున్న గులాబీ గణాలు!

పదుగురూ కలిసి పదేపదే గుర్రాన్ని గాడిద అంటే.. సమాజం మొత్తం కూడా దాన్ని గాడిద గానే గుర్తిస్తుందనేది లోకరీతి. ఇప్పుడు తెరాస గణాలన్నీ ఇదే సిద్ధాంతాన్ని ఇప్పుడు ఆచరణలో పెడుతున్నాయి. తెలంగాణ జేఏసీ సంకల్పించిన నిరుద్యోగ ర్యాలీ కి అనుమతుల నిరాకరణ మాత్రమే కాకుండా.. అన్ని రకాలుగానే దానిని తెలంగాణ పోలీసులు అడ్డుకున్న వైనం అందరికీ తెలిసిందే. విద్యార్థులు, నిరుద్యోగులు నగరంలో ఎక్కడికక్కడ ఉద్యమించడానికి పూనుకున్న ప్రతిచోటా.. పోలీసులు తమదైన శైలిలో తొక్కి పారేశారు. నిరుద్యోగ ర్యాలీ అల్లకల్లోలం అయింది. 

నిరుద్యోగ ర్యాలీ ద్వారా కోదండరాం అండ్ కో తాము సఫలం అయ్యామనే భావించారు. ర్యాలీ జరగలేదనే మాట తప్ప.. నిరుద్యోగిత అనే అంశం మీదికి రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించే విషయంలో ఈ ర్యాలీ సక్సెస్ అయింది. అయితే గులాబీ గణాలు సహజంగానే ఈ నిరసన ర్యాలీలను జీర్ణించుకోలేకపోతున్నాయి. 

ప్రస్తుతం గులాబీ గణాలు, వారి చేతుల్లోని మీడియా యావత్తూ కూడా.. నిరుద్యోగ ర్యాలీ అట్టర్ ఫ్లాప్ అయిందనే ప్రచారానికి తెగబడుతున్నాయి. ఒకవైపు తమ గులాబీ బాస్ తిరుమలలో స్వామివారికి ఆభరణాలు సమర్పిస్తున్న వేళ.. ఇక్కడ నిరసన ఉద్యమాల పేరిట ప్రభుత్వాన్ని చికాకు పెట్టడానికి ప్రయత్నించినందుకు కోదండరాం మీద గులాబీ శ్రేణులన్నీ గుర్రుమంటున్నాయి. ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి. అందులో భాగంగానే.. ర్యాలీ ఫ్లాప్ అయిందని... లేని సమస్యను సృష్టించి యువతరాన్ని తప్పుదోవ పట్టించడానికి కోదండరాం చేసిన కుట్రను యువతరం బాగా అర్థం చేసుకున్నదని, అందుకే ఆయన ర్యాలీ అనే పిలుపునకు ఏమాత్రం స్పందన లభించలేదని గులాబీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి.

నిజానికి పోలీసు దాష్టీకాలు పరిమితంగా ఉన్నా సరే.. నిరుద్యోగ ర్యాలీ అనేది మరో తీరులో ఉండేది.  పోలీసులు అనుమతి నిరాకరించడం, కోర్టు కూడా అనుమతి ఇవ్వకపోవడం, ధిక్కరించి ర్యాలీ చేయడానికి జేఏసీ పూనుకోవడం... లాంటి నేపథ్యం అడ్డగోలుగా అణచివేయడానికి పోలీసులకు అధికారం ఇచ్చినట్లు అయింది. విద్యార్థులు నగరంలో ఎక్కడ రోడ్ల మీదకు వచ్చినా.. పోలీసులు ఎక్కడికక్కడ అణచివేశారు. ఇంతా కలిపి రోజంతా సాయంత్రం వరకూ నగరంలో ఎక్కడో ఒకచోట విద్యార్థుల, నిరుద్యోగుల హడావిడి కనిపిస్తూనే వచ్చింది. ఏది ఏమైనప్పటికీ.. అసలు నిరసన అనేది వ్యక్తం కానేలేదని.. ప్రజలెవ్వరూ కోదండరాంను నమ్మలేదని.. కేసీఆర్ సర్కారులో నిరుద్యోగులు ఎవ్వరూ అసంతృప్తితో లేరని అంటూ.. నిరసనోద్యమం  మీద ఫ్లాప్ ముద్ర వేసే గోబెల్స్ ప్రచారానికి గులాబీ శ్రేణులు ఎగబడుతూ ఉండడం విశేషం. 

Show comments