విశ్వనగరానికి ఏంటీ ఖర్మ.?

'హైద్రాబాద్‌ని విశ్వనగరం చేస్తాం..' అని తెలంగాణలోని అధికార పార్టీ చెప్పడం మామూలే.. ఆ విశ్వనగరం కాస్తా, చినుకు పడితే, అనంత సాగరంగా మారిపోవడమూ మామూలే అయిపోయింది. 'గత పాలకుల పాపం మమ్మల్ని వెంటాడుతోంది..' అని ఇంకా ఇంకా పాత మాటలు చెప్పడానికి వీల్లేదిప్పుడు. మూడేళ్ళయింది తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకొచ్చి. 

అయితే, హైద్రాబాద్‌ విషయంలో ప్రత్యేక బాధ్యతలు తీసుకున్న మంత్రి కేటీఆర్‌ ఇంకా పాత పాటే పాడుతున్నారు. 'ఆరు దశాబ్దాల నిర్లక్ష్యం పోవాలంటే.. కొంత సమయం పడ్తుంది.. వేల కోట్ల రూపాయల నిధులు కావాలి పరిస్థితిని చక్కదిద్దడానికి.. అంత మొత్తం ఖర్చు చేయడమంటే ఏ ప్రభుత్వానికి అయినా కష్టమే..' అంటూ తాజాగా మరోమారు కేటీఆర్‌ సన్నాయి నొక్కులు నొక్కేశారు. 

తొలి వాన కురవడంతోనే, ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలోని తాత్కాలిక పరిపాలనా ప్రాంగణంలో డొల్లతనం బయటపడింది. అక్కడ పెద్ద రచ్చ జరుగుతున్న సమయంలోనే, హైద్రాబాద్‌నీ తొలివాన ముంచెత్తింది. హైద్రాబాద్‌లో దాదాపు కోటి మంది జనాభా.. ఇంకేముంది, ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి జనజీవనం స్తంభించిపోయింది. ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ఇచ్చేయాల్సిన పరిస్థితి. అన్నిటికీ మించి, రోడ్ల మీదకు జనాలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రాదని అధికారులే చెబుతున్నారాయె. ఇలాగైతే, హైద్రాబాద్‌ విశ్వనగరమెలా అవుతుంది.? 

గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్‌ చెప్పిందేంటి.? ఇప్పుడు జరుగుతున్నదేంటి.? గత ఏడాది వర్షాలతో వరదలు ముంచెత్తి, నానా బీభత్సం అయిపోయింది హైద్రాబాద్‌లో. మళ్ళీ మరోమారు ఆ దుస్థితి రాదన్న గ్యారంటీ ఏంటి.? అప్పట్లో 'నాలాల కబ్జా' అంటూ నానా హడావిడీ చేసి, అప్పటికప్పుడు ఆకస్మిక కూల్చివేతలకు దిగింది సర్కార్‌. అయినా, వ్యవహారం మళ్ళీ మొదటికొచ్చింది. 

ఇదిలా వుంటే, హైద్రాబాద్‌ సహా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా రోడ్ల మీద గుంతలు కన్పించడానికి వీల్లేదని సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హుకూం జారీ చేశారు. ఆ హెచ్చరికలు పబ్లిసిటీకి పనికొచ్చేశాయ్‌గానీ, రోడ్ల మీద గుంతలు పూడ్చడానికి పనికిరాలేదు. గుంతలకు తోడు వర్షాలు.. వెరసి, గ్రేటర్‌ హైద్రాబాద్‌లో రోడ్లు జనాల ప్రాణాల్ని తోడేసే దుస్థితికి కారణమవుతున్నాయి.

Show comments