దర్శకరత్న పుట్టినరోజు: స్పెషల్‌ వేడుక

సెలబ్రిటీల పుట్టిన రోజుకి ఎంతో ప్రత్యేకత వుంటుంది. అభిమానులు చేసే హంగామా కారణంగా ఆ పుట్టినరోజు వేడుకలకు కొత్త కళ వస్తుంది. దర్శకరత్న దాసరి నారాయణరావు పుట్టినరోజు వేడుకలు ఎప్పుడూ చాలా ప్రత్యేకంగానే జరుగుతుంటాయి. మొత్తంగా సినీ పరిశ్రమ అంతా దాసరి వద్దకే 'క్యూ' కడుతుంది. సినీ, రాజకీయ రంగ ప్రముఖులు, బుల్లితెర నటీనటులు, సాంకేతిక నిపుణులు.. ఇలా ఒకరేమిటి, దాసరిని 'పెద్దన్న'గా భావించి, ఆయన వద్దకు వెళ్ళి ప్రత్యక్షంగా శుభాకాంక్షలు తెలపడాన్ని ఓ 'గౌరవం'గా భావిస్తుంటారు. 

ఈసారి దాసరి పుట్టినరోజు వేడుకలు మరీ మరీ ప్రత్యేకం. ఎందుకంటే, ఇటీవల దాసరి తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డారు. సుమారు రెండు నెలలకుపైగానే ఆయన ఆసుపత్రికి పరిమితమయిపోయారు. కొన్నాళ్ళపాటు దాసరి ఆరోగ్య పరిస్థితిపై తీవ్రమైన సస్పెన్స్‌ నెలకొంది కూడా. దాసరి, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాకగానీ, ఆయన పూర్తిగా కోలుకున్నారన్న నమ్మకం చాలామందికి కలగలేదు. అప్పటిదాకా సినీ పరిశ్రమ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 

ఈ నేపథ్యంలోనే, దాసరిని ప్రత్యేకంగా కలిసి ఈ పుట్టినరోజునాడు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. శతాధిక చిత్రాల దర్శకుడైన దాసరి నారాయణరావు, తెలుగు సినీ పరిశ్రమకు చేసిన సేవ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆణిముత్యాల్లాంటి చిత్రాలు ఆయన్నుంచి వచ్చాయి. దర్శకుడు, నటుడు, నిర్మాత.. ఇలా దాసరి, ఏం చేసినా తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. కేంద్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారాయన. ఈ ప్రత్యేకమైన పుట్టినరోజు సందర్భంగా దాసరి నారాయణరావుకి శుభాకాంక్షలు చెబుదాం.

Show comments