హారిక హాసిని లాంటి పెద్ద బ్యానర్ కు తోడుగా వచ్చిన మరో బ్యానర్ సితార ఎంటర్ టైన్ మెంట్స్. బాబు బంగారం, ప్రేమమ్ లాంటి రెండు హిట్ లు ఇచ్చింది. కానీ మళ్లీ సినిమా స్టార్ట్ చేయలేదు. హారిక హాసిని బ్యానర్ ను త్రివిక్రమ్ డైరక్షన్ సినిమాలకు అంకింతం ఇచ్చేయాలని నిర్మాత చినబాబు అనుకోవడంతో, ఈ కొత్త బ్యానర్ స్టార్ట్ చేసారు. దీనిపై చకచకా సినిమాలు చేయాలని అనుకున్నారు. కానీ, అదే కనిపించడం లేదు.
దీనిపై ఇండస్ట్రీలో భలే గుసగుసలు వినిపిస్తున్నాయి. డైరక్టర్ త్రివిక్రమ్ కారణంగా ఆ బ్యానర్ కు చాలా మంది యంగ్ డైరక్టర్లు, హీరోలు దూరంగా వుంటున్నారని టాక్ వినిపిస్తోంది. కొంత మంది మాంచి స్క్రిప్ట్ లతో వెళ్లినా, మొత్తం వ్యవహారం అంతా త్రివిక్రమ్ నే పర్యవేక్షిస్తున్నారట. ఆయనకు నచ్చేలా స్క్రిప్ట్ తయారు చేయాల్సిరావడం, పైగా ఓ పట్టాన ఆయనను నచ్చింప చేయలేకపోవడం అన్న సమస్యలు వస్తున్నాయని టాక్.
నందినీ రెడ్డి సినిమా ఆల్ మోస్ట్ ఫైనల్ అయినట్లే కనిపించింది. కానీ త్రివిక్రమ్ కు స్క్రిప్ట్ నచ్చక ఆగిపోయిందని తెలుస్తోంది. పేరుకు నిర్మాతలు వున్నా, త్రివిక్రమ్ నే టెక్నికల్ టీమ్ తో మాట్లాడడం, స్టార్ కాస్ట్ సజెస్ట్ చేయడం చేస్తున్నారని అంటున్నారు. పైగా తాను చేసే సినిమాలను ప్రమోట్ చేయించినట్లు, ఈ సినిమాలను ప్రమోట్ చేయించరని, ఇది గత రెండు సినిమాల విషయంలో రుజువయిందని టాక్ వినిపిస్తోంది. నందినీ రెడ్డికి జరిగినట్లే మరో ఒకరిద్దరికి కూడా జరిగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది నిజమైనా కాకున్నా, హారిక హాసిని, సితార సంస్థల్లో త్రివిక్రమ్ మాటే శాసనం అన్నది మాత్రం వాస్తవం అని ఇండస్ట్రీ టాక్.
ప్రస్తుతం హారిక హాసిని బ్యానర్ లో పవన్ తో త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ కావాలి. ఆ పనుల్లో త్రివిక్రమ్ బిజీగా వుంటారు మరో ఆరేడు నెలలు. అంతవరకు సితార బ్యానర్ పై సినిమా వుండదేమో?