టీడీపీ.. రామోజీ- కేసీఆర్ సాన్నిహిత్యాన్ని ప్రశ్నించగలదా?

నిజమే.. తెలంగాణ ఏర్పడ్డాకా, తెరాస అధికారంలోకి వచ్చాకా అక్కినేని కుటుంబానికి కేసీఆర్ తో, కేటీఆర్ తో సాన్నిహిత్యం మొదలైంది. అంతా దోస్తులయ్యారు. ఆ దోస్తీ.. నాగార్జున ఆక్రమణల క్రమబద్ధీకరణకు ఉపయోగపడుతోందనేది తెలుగుదేశం ఆరోపణ. మరి ఇలా మొదలుపెట్టిన తెలుగుదేశం మిగతా తెరాస దోస్తుల గురించి, వాళ్ల విషయంలో ఉన్న ఆరోపణల గురించి మాట్లాడగలదా?

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్, ఆ పార్టీ ముఖ్య నేత కేటీఆర్ లపై ధ్వజమెత్తే క్రమంలో.. అక్కినేని నాగార్జున ను ప్రస్తావనలోకి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ.  నాగార్జునతో కేసీఆర్, కేటీఆర్ లకు ఉన్న సాన్నిహిత్యాన్ని ప్రస్తావిస్తూ.. ఎన్ కన్వేన్షన్ సెంటర్ కు సంబంధించిన ఆక్రమణలపై చర్యలు తీసుకోవడం లేదంటూ రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే విరుచుకుపడ్డాడు. 

ఈ విధంగా మాట్లాడటం ద్వారా కొంతమంది తెలంగాణ వాదులను అయితే.. రేవంత్ రెడ్డి ఆకట్టుకున్నాడు. హైదరాబాద్ లోని ఆంధ్రా పెట్టుబడి దారులు… అంటూ నాగార్జున వంటి వారిపై ఆది నుంచి ఆగ్రహావేశాలను కలిగిన వారిని రేవంత్ ఆకట్టుకున్నాడు. అంత వరకూ ఎందుకు.. గతంలో తెరాస కూడా హైదరాబాద్ లోని ఆంధ్రా పెట్టుబడిదారులు అంటూ నాగార్జున వంటి వారి మీద విరుచుకుపడేది. వీళ్ల లొసుగులకు సంబంధించి రకరకాల ఉద్యమాలు నిర్వహించింది.

అయితే తెలంగాణ ఏర్పడ్డాకా.. కేసీఆర్ సీఎం అయ్యాకా.. ఆంధ్రా పెట్టుబడిదారులు కేసీఆర్ కు దోస్తులయ్యారు. అంతా బహిరంగ రహస్యమే! ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ వ్యవహారాలను ప్రస్తావించడం మొదలు పెట్టింది. Readmore!

అంటే.. గతంలో తెరాస పోషించిన రోల్ ను తెలుగుదేశం ఎంచుకుంటోందని అనుకోవాలి! అయితే.. తెలుగుదేశం ఆక్రందన సెలెక్టివ్ గా ఉంటుందని వేరే చెప్పనక్కర్లా. చెరువుల ఆక్రమణ గురించి ఉన్న ఆరోపణలను ప్రస్తావించిన టీడీపీ నాగార్జున పేరును ప్రస్తావించింది, అయితే ఇలాంటి వ్యవహారాలు చాలానే ఉన్నాయి.

రామోజీ ఫిల్మ్ సిటీని లక్ష నాగళ్లతో దున్నిస్తా అని గతంలో కేసీఆర్ వ్యాఖ్యానించారు. అయితే తను అలా అనలేదని కేసీఆర్ ఇప్పుడంటారు. ఇక రాఘవేంద్రరావు ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని కమర్షియల్ గా మార్చి వ్యాపారం చేస్తున్నారని.. గతంలో టీఆర్ఎస్ రచ్చ చేసింది. అయితే అధికారంలోకి వచ్చాకా వాటి గురించి మారు మాట్లాడటంలా! 

మరి తెలుగుదేశం వాటి గురించి కూడా మాట్లాడగలదా? నాగార్జునకు కేసీఆర్ తో గల సాన్నిహిత్యం గురించి ప్రస్తావిస్తూ, ఆక్రమణలను కొనసాగిస్తున్నారని చెబుతున్న టీడీపీ, ఇదే తరహాలో సాగుతున్న రామోజీ – కేసీఆర్ ల మధ్య సాన్నిహిత్యాన్ని ప్రశ్నించగలదా? ప్రభుత్వ పెద్దలతో నాగార్జునకు ఉన్న సాన్నిహిత్యం వివాదాస్పదం అంటున్న టీడీపీ, మిగతా స్నేహాల గురించి ప్రస్తావించగలదా? వాటి వెనుక లొసుగులున్నాయని అనగలదా? 

Show comments