'పన్నీరు' పనికిమాలినోడు కాదు...!

తమిళనాడులో జయలలిత మరణించగానే ముఖ్యమంత్రి పన్నీరుశెల్వం పని ఇక అయిపోయిందనే అందరూ అనుకున్నారు. జయలలిత మరణించినట్లు అపోలో ఆస్పత్రి వర్గాలు డిసెంబరు అయిదో తేదీన ప్రకటించగానే తదుపరి ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళేనని, పన్నీరు శెల్వం పదవిలో ఉండరని మంత్రులు ప్రకటించేశారు. పన్నీరు సమక్షంలోనే బాహాటంగా శశికళకు మద్దతు ప్రకటించారు. మంత్రుల ప్రవర్తనకు పన్నీరు తీవ్రంగా ఆవేదన చెందారు. ఒక దశలో ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేసి వెళ్లిపోతారని వార్తలొచ్చాయి. మంత్రులు ఆయన్ని పూర్తిగా బేఖాతరు చేసి చిన్నమ్మ భజన చేయడం ప్రారంభించారు. కాని ఇప్పటివరకు పన్నీరు పదవికి ముప్పు రాలేదు. ఆయనకు గండం గడిచిపోయిందని, పదవిలో నిరాటంకంగా కొనసాగుతారని కూడా చెప్పలేం. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే చిన్నమ్మ కచ్చితంగా ముఖ్యమంత్రి అయి తీరుతుందని కూడా చెప్పలేం. బీజేపీ కేంద్ర నాయకత్వం వేసే అడుగుల మీద కూడా పన్నీరు శెల్వం భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్పొచ్చు. 

పన్నీరు శెల్వంను తొలగించి చిన్నమ్మకు పగ్గాలు ఇవ్వాలని మంత్రులు ఆరాటపడుతుండగా సచివాలయంలోని అనేకమంది అధికారులు పన్నీరుశెల్వం గురించి సానుకూలంగా మాట్లాడుతున్నారు. పన్నీరు శెల్వం బొమ్మవంటి వాడని, ఎలా ఆడిస్తే అలా ఆడతాడని ఒక అభిప్రాయం ఉంది. కాని ఆయన సమర్థంగా పనిచేస్తున్నారని, గతంలోని 'వర్క్‌ కల్చర్‌'ను మారుస్తున్నారని అధికారులు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సచివాలయంలో ముఖ్యమంత్రిపై ఈ విధమైన సానుకూల అభిప్రాయం ఉండటం విశేషమే. ఇక్కడ చెప్పుకోవల్సిన మరో విశేషమేమిటంటే చిన్నమ్మ భర్త నటరాజన్‌ పన్నీరుకు అనుకూలంగా మాట్లాడటం. ఆయన మంచిగా పనిచేస్తున్నారని, మార్చాల్సిన అవసరం లేదని అన్నాడు. కాని మెజారిటీ ఎమ్మెల్యేలు కోరుకుంటే పరిస్థితి వేరుగా ఉంటుందన్నాడు. తన భార్య శవికళకు పదవీ కాంక్ష లేదని చెప్పడానికి ఈ విధంగా మాట్లాడివుండొచ్చు.

పన్నీరు శెల్వం పరిపాలనలో సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఆయన తనకు తాను నాయకుడిగా తీర్చిదిద్దుకుంటూ సచివాలయంలో గతంలో లేని వాతావరణాన్ని కల్పిస్తున్నారని అంటున్నారు. పని విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారన్నారు. కరుణానిధి, జయలలిత ప్రభుత్వాల్లో పనిచేసిన ఒక ఉన్నతాధికారి పన్నీరు గురించి మాట్లాడుతూ ఆయన ప్రజలతో వ్యవహరించే తీరులో వినయం, దయ కలగలిసి ఉంటాయన్నారు. ముఖ్యమంత్రి ఫైల్స్‌ చాలా త్వరగా క్లియర్‌ చేస్తున్నారని, గతంలో ఈ పరిస్థితి లేదని మరో అధికారి చెప్పాడు. పన్నీరు అందరితో చర్చించిన తరువాతనే నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇలాంటి పరిస్థితి గతంలో తామెన్నడూ చూడలేదని మరో అధికారి తెలియచేశాడు.  అంటే జయలలిత పనితీరుకు, ఈయన పనితీరుకు చాలా తేడా ఉందని అర్థమవుతోంది. జయలలిత నియంతలా వ్యవహరించేవారని, ఈయన ప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని భావించాలి. జయలలిత కన్నుమూయగానే అధికారులంతా పోలోమని శశికళ దగ్గరకే వెళ్లారు.

విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్లే ఆమె దగ్గర క్యూ కట్టారంటే ఆమే ముఖ్యమంత్రి అవుతుందని అనుకున్నట్లే కదా. కాని పరిస్థితి తేడాగా ఉండటంతో అధికారులు పన్నీరుశెల్వంను ముఖ్యమంత్రిగా గుర్తించడమే కాకుండా గౌరవిస్తున్నారు కూడా. ఒకవేళ శశికళే ముఖ్యమంత్రి అయితే అధికారులు, ఉద్యోగులు ఇబ్బంది పడాల్సి వస్తుందేమో. తాను జయలలిత మాదిరిగానే వ్యవహరిస్తానని, ఆమె అడుగుజాడల్లోనే నడుస్తానని చిన్నమ్మ చెప్పింది. అధికారులు పన్నీరు పాలనను ప్రశంసిస్తున్నారంటే జయలలిత హయాంలో అంతో ఇంతో ఇబ్బంది పడ్డారనే అనుకోవాలి. ఈ విషయం చిన్నమ్మ మద్దతుదారులైన నాయకులకు, మంత్రులకు తెలియకుండా ఉండదు. కాని వారు మాత్రం ప్రధాన కార్యదర్శిగా ఉన్నవారే ముఖ్యమంత్రి కావాలని, ఇది పార్టీ సంప్రదాయమని వితండవాదం చేస్తున్నారు. పన్నీరుశెల్వం పనికిమాలినవాడేమీ కాదు. సుదీర్ఘ రాజకీయ, పరిపాలనా అనుభవం ఉన్నవాడు. మున్సిపల్‌ ఛైర్మన్‌గా ప్రయాణం ప్రారంభించిన ఆయన మంత్రిగానే కాకుండా జయలలిత ఇబ్బందుల్లో పడినప్పుడు తాత్కాలికంగా ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాబట్టి ఆయనకు ప్రజలతో, అధికారులతో ఎలా వ్యవహరించాలో తెలుసు. 'అమ్మ'కు పరమ విధేయుడైన ఈయనలో సమర్థత కూడా ఉందని ఇప్పుడు తెలుస్తోంది. Readmore!

Show comments