పట్టిసీమ.. ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత వివాదాస్పదమైన ఎత్తి పోతల పథకమిది. గోదావరి నది నుంచి నీళ్ళను కృష్ణా నదికి తరలించే ఉద్దేశ్యంతో అతి తక్కువ కాలంలో దీన్ని ప్రారంభించి, పూర్తి చేసేసింది (!) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. శంకుస్థాపన, ప్రారంభోత్సవం, ప్రాజెక్టు జాతికి అంకితం, మోటార్ల ప్రారంభం, కాలువల ప్రారంభం, నీటి తరలింపు, గోదావరి - కృష్ణా అనుసంధానం.. ఇలా చాలా ఈవెంట్స్ జరిగాయి గడచిన రెండేళ్ళలో.
ఎట్టకేలకు, నేడు అధికారికంగా పట్టిసీమ ప్రాజెక్టుని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారట. 'అట' ఎందుకంటే, ప్రభుత్వం, అధికార పార్టీ చెబుతోంది గనుక జనం నమ్మాలంతే. పూజలు.. మళ్ళీ మళ్ళీ పూజలు.. చేస్తూనే వచ్చారు ఇప్పటిదాకా. ఇంకా ప్రారంభోత్వవాల పేరుతో ఈ తతంగం ఇంకెన్నాళ్ళు కొనసాగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. ఎక్కడన్నా ఏ ప్రాజెక్టు అయినా పూర్తి కాకుండా జాతికి అంకితమవుతుందా.? ఆ అద్భుత ఘట్టానికి పట్టిసీమ కేంద్ర బిందువయ్యింది మరి.
నదుల అనుసంధానం ఇప్పటికే పూర్తయిపోయింది గనుక, పట్టిసీమను కొత్తగా ప్రారంభించాల్సిన అవసరమేమొచ్చిందో చంద్రబాబుకే తెలియాలి. పనుల్ని పర్యవేక్షించడం వేరు, పదే పదే ప్రారంభోత్సవాలు చేయడం వేరు. దేశ చరిత్రలోనే ఇంత పబ్లిసిటీ 'పిచ్చి' వున్న ముఖ్యమంత్రి బహుశా ఇంకొకరు కనిపించరేమో. పట్టిసీమ ప్రాజెక్టు పేరు చెప్పి వెయ్యి కోట్లకు పైనే ప్రజాధనం అక్రమార్కుల చేతుల్లోకి, అందునా ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేష్ జేబుల్లోకి వెళ్ళిపోయిందన్న విమర్శలున్నాయి.
పట్టిసీమ పేరు చెప్పి కృష్ణా, గోదావరి నదీ జలాలు ఆంధ్రప్రదేశ్‌ని సుభిక్షం చేస్తాయా.? లేదా.? అన్నది పక్కన పెడితే, ఈ ప్రాజెక్ట్ పుణ్యమా అని పోలవరం ప్రాజెక్ట్ అటకెక్కేసింది. యుద్ధ ప్రాతిపదికన పట్టిసీమను పూర్తి చేసిన చంద్రబాబు సర్కార్, పోలవరం ప్రాజెక్టుని కనీసం పట్టించుకోకపోవడం శోచనీయం. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే, పట్టిసీమ అవసరమే వుండదు. ఇది జగమెరిగిన సత్యం.
ఏదిఏమైనా, ఇంకోసారి పట్టిసీమ ప్రాజెక్టుని అధికారికంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. మంత్రులు, అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వేద పండితులు మంత్రోచ్ఛారణల నడుమ చంద్రబాబు, మోటార్లను ప్రారంభించేశారు. ఇదే లాస్ట్ అనుకోవచ్చా.? ఇంకోసారి ఇలాంటి ఈవెంట్ చంద్రబాబు చేయరని ఫిక్సయిపోవచ్చా.? ఏమో మరి, అంతా ఆయన ఇష్టం. ఆయనకు మళ్ళీ మూడొస్తే ఇంకో నెల రోజుల్లోనే ఇలాంటి ఈవెంట్ పట్టిసీమ పేరుతో ఇంకోటి చేసెయ్యొచ్చు. ఎనీ డౌట్స్.?