బాబుగారి ఫిరాయింపుల 'కథ'.!

వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే, చెప్పేటోడు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడే.! అవును మరి, పార్టీ ఫిరాయింపులు ఎందుకు జరుగుతున్నాయో తెలుసా.? చంద్రబాబు సొంత అవసరాల కోసం కాదు, ఆంధ్రప్రదేశ్‌ కోసమే. ఈ విషయంలో చంద్రబాబు అచ్చంగా తన పాత సహచరుడు, ప్రస్తుత విరోధి, పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బాటలోనే నడుస్తున్నారు. 

పార్టీ ఫిరాయింపుల విషయంలో ఆ మధ్య కేసీఆర్‌పై దుమ్మెత్తి పోసేశారు చంద్రబాబు. 'రాజకీయ వ్యభిచారం..' అంటూ విరుచుకుపడ్డారు. పార్టీ ఫిరాయించిన వ్యక్తికి మంత్రి పదవి ఎలా ఇస్తారు.? ఇది రాజకీయ వ్యభిచారం కాదా.? అని ప్రశ్నించిన చంద్రబాబు, అలా ప్రశ్నించిన వైనాన్ని తాజాగా ఒప్పేసుకున్నారండోయ్‌. 'అవును, అప్పుడు నేనే ప్రశ్నించాను.. కానీ, ఇప్పుడు పార్టీ ఫిరాయింపులు నా కోసం కాదు, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం..' అంటూ చంద్రబాబు సెలవిచ్చారు. 

పార్టీ ఫిరాయింపులకు సంబంధించి చంద్రబాబు చెప్పే రీజన్‌ ఎప్పుడూ సిల్లీగానే కన్పిస్తుంటుంది. అభివృద్ధికి వైసీపీ అడ్డు పడ్తోందనీ, ఆ కారణంగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తున్నారని చంద్రబాబు, ఆయన బాటలోనే టీడీపీ నేతలు చెప్పడం మామూలే. ఓ సారి, గవర్నర్‌ వద్దకు వెళ్ళిన జగన్‌, 'ఈ దుర్మార్గపు ప్రభుత్వం అంతమయ్యే రోజెంతో దూరంలో లేదు.. వాళ్ళకీ మాకూ తేడా తక్కువే.. ఓ పాతిక మంది ఎమ్మెల్యేలు మా వైపు వస్తే, చంద్రబాబు ప్రభుత్వం కూలిపోతుంది..' అని వ్యాఖ్యానించడాన్ని సాకుగా చూపి, పార్టీ ఫిరాయింపులకు టీడీపీ తెరలేపింది. 

అసలు, పార్టీ ఫిరాయింపులకీ, అభివృద్ధికీ సంబంధమేంటో చంద్రబాబుకే తెలియాలి. ప్రతిపక్ష నేత, మీడియాతో మాట్లాడుతూ ఏదో యధాలాపంగా చెప్పిన మాటని అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీకి రాజకీయ వ్యభిచారానికి.. (అదేనండీ, పార్టీ ఫిరాయింపులకి చంద్రబాబు చెప్పిన అర్థం అదే కదా) తెరలేపడమేంటట.? 

పోనీ, పార్టీ ఫిరాయింపుల్లో తప్పు లేదు.. అని అంటారా.? అంటే, అదీ లేదు. పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా తమ పార్టీ నినదిస్తుందనీ, జాతీయ స్థాయిలో పార్టీ ఫిరాయింపుల్ని నిరోదించేందుకు చట్టం కావాలని డిమాండ్‌ చేస్తామనీ ఇంకోపక్క చంద్రబాబు అండ్‌ కో మీడియాకెక్కి ప్రసంగాలు దంచేస్తూనే వున్నారాయె. ఇలాంటి 'కథ'లు చెప్పమంటే చంద్రబాబు తర్వాతే ఎవరైనా.!

Show comments