సమంత రీసెర్చ్‌ మొదలెట్టేసింది

తెలంగాణలో చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికైంది హీరోయిన్‌ సమంత. మామూలుగా బ్రాండ్‌ అంబాసిడర్‌ అంటే, ఆ ప్రోడక్ట్‌ తరఫున ప్రచారం చేయడం మాత్రమే. కానీ, చేనేతకు సంబంధించి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించడమంటే కేవలం ప్రచారం మాత్రమే చేస్తే సరిపోదని సమంత అనుకుంటోంది. అందుకే, చేనేత సమస్యలపై 'రీసెర్చ్‌' షురూ చేసిందామె. 

హీరోయిన్‌గా టాప్‌ స్లాట్‌లో వున్నా, సేవా కార్యక్రమాల్లో సమంత విరివిగా పాల్గొంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! తన స్టార్‌ డమ్‌ని సేవా కార్యక్రమాల కోసం వినియోగించడం ద్వారా సమంత తన పెద్ద మనసుని ఎప్పుడో చాటేసుకుంది. చేనేత విషయంలోనూ, తన స్టార్‌డమ్‌ని ఉపయోగించుకోవడంతోపాటుగా, ఆ రంగానికి తనవంతుగా ఇంకా ఏం సాయం చేయగలనన్నదానిపై సమాలోచనలు చేస్తోందట ఈ బ్యూటీ. 

చేనేత ఉత్పత్తులకు ప్రచారం కల్పించడం, అమ్మకాల కోసం వేదికల్ని ఏర్పాటు చేయడం, వీటితోపాటుగా చేనేత కార్మికులకు ఆర్థిక సహాయం వంటి విషయాలపైనా సమంత, తన సన్నిహితులతో చర్చిస్తోందట. ఈ క్రమంలోనే చేనేత కార్మికుల వద్దకు వెళ్ళి, వారి వెతల్ని తెలుసుకోవడంతోపాటుగా, అక్కడ తన కోసం కొన్ని 'ఉత్పత్తుల్ని' కొనుగోలు చేసింది సమంత. త్వరలోనే చేనేతకు సంబంధించి తాను ఏం చేయగలనో చెబుతానంటోందామె. 

చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా పనిచేస్తే అంతరించే దశకు చేరుకుంటోన్న ఆ రంగానికి కొత్త ఉత్సాహమొస్తుంది.. సెలబ్రిటీలు స్వచ్ఛందంగా చేనేతకు మద్దతుగా నిలిస్తే, వేలాది కుటుంబాలు బాగుపడ్తాయ్‌. అన్నట్టు, పవన్‌కళ్యాణ్‌ ఆంధ్రప్రదేశ్‌లో చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వుంటానని గతంలోనే ప్రకటించిన విషయం విదితమే. Readmore!

Show comments