కేంద్ర మాజీమంత్రి వెంకయ్యనాయుడు, త్వరలో ఉపరాష్ట్రపతి కాబోతున్నారు. కేంద్రమంత్రి అంటే బాధ్యతలెక్కువ.. ఉపరాష్ట్రపతి పదవి అంటే గౌరవం ఎక్కువ. రాజకీయాల్లో వుంటే రాజకీయ విమర్శలు తప్పవు. అదే రాజ్యాంగబద్ధమైన పదవుల్లో వుంటే, ఆ విమర్శలకు ఆస్కారం చాలా చాలా తక్కువ. సో, ఎలా చూసినా వెంకయ్యనాయుడుకి కేంద్ర మంత్రిపదవి కంటే ఉపరాష్ట్రపతి పదవి భలే ఆనందాన్నిస్తుంది.
పైగా, వెంకయ్యనాయుడు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి చాలా కాలమైంది. 'ఇకపై రాజ్యసభకూ వెళ్ళాలనిలేదు..' అని ఓ సందర్భంలో వెంకయ్యనాయుడు చెప్పారు కూడా. అంటే, వెంకయ్య కోరుకున్నట్టుగానే, ఆయన 'అత్యున్నతమైన పదవి'ని తన జీవితంలో చూడబోతున్నారన్నమాట. ఇంతలా వెంకయ్య, తాను కోరుకున్న పదవిలో కూర్చుంటున్నప్పుడు ఆయనకు అసంతృప్తి ఎందుకు వుంటుంది.? పైగా, ఆయన బీభత్సమైన అదృష్టవంతుడనే భావనతో ప్రతి ఒక్కరూ ఏకీభవిస్తున్నారు.
నిజమే, కేంద్రమంత్రి పదవికి పవర్ ఎక్కువ. కానీ, ఏంలాభం.? వెంకయ్యనాయుడికే కేంద్రమంత్రిగా వున్నప్పుడు 'పవర్' వుండి వుంటే, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా వచ్చేదే. రైల్వేజోన్‌ని కేంద్రమంత్రిగా వున్నప్పుడే వెంకయ్యనాయుడు సాధించేవారు. రాజధాని అమరావతి నిర్మాణంలో వెంకయ్య కీలక భూమిక పోషించేవారు కూడా. ఇవేమీ జరగలేదంటే, దానర్థమేంటి.? వెంకయ్యకి 'పవర్' వున్నా, లేనట్లే కదా.!
రానున్న రెండేళ్ళలో కేంద్రం, రాష్ట్రాన్ని ఉద్ధరించేస్తుందని అనుకోవడానికి వీల్లేదు. రెండేళ్ళు.. అంటున్నాంగానీ, గట్టిగా వున్నది ఏడాదిన్నరే. నరేంద్రమోడీ ఇంకాస్త తొందరపడితే, ముందస్తు ఎన్నికలు ఏడాదిలోపే వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎలా చూసినా, వెంకయ్య 'సేఫ్ గేమ్' ఆడారనే విషయం అర్థమవుతోంది.
బీజేపీకి దూరమవడంపై వెంకయ్య కంటతడిపెట్టినంత పన్జేశారు. నిజమే, దశాబ్దాల తరబడి ఆ పార్టీతో అనుబంధం వుందాయనకి. అధికారికంగా బీజేపీతో తెగతెంపులు నిజమే అయినా, అనధికారికంగా బీజేపీతో వెంకయ్య సంబంధాలు కొనసాగుతాయి. అఫ్‌కోర్స్, అద్వానీనే పవర్‌లెస్ చేసేసిన నరేంద్రమోడీ, వెంకయ్య ఇంకా ప్రత్యక్ష రాజకీయాల్లో వుంటే ఏం చేసేవారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ లెక్కన, అలాంటి అవమానాలు ఎదురుకానందుకు వెంకయ్య హ్యాపీగా ఫీలవ్వొచ్చు.!
ఎలా చూసుకున్నాసరే, వెంకయ్యకు ఇక్కడ జరిగిన 'లాస్' అయితే ఏమీలేదు. అది రాజకీయంగా కావొచ్చు, పవర్ పరంగా కావొచ్చు, గౌరవం పరంగా కావొచ్చు.! ఎనీడౌట్స్.?