'బాహుబలి-2' షో పడిందా.? లీకైందా.?

ఏదన్నా సినిమా విడుదలవుతోందంటే, ముందుగా లీకేజీ గాసిప్స్‌ తెరపైకొస్తున్నాయి. ఈ గాసిప్స్‌ చాలావరకు నిజమవుతున్నాయి. నిర్మాత తేరుకునేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. 'చెప్పి మరీ' సినిమాని నట్టేట్లో ముంచేస్తున్నారు లీకు వీరులు, పైరసీ కింగులు. 'అత్తారింటికి దారేది' సినిమా రిలీజ్‌కి ముందే పూర్తిగా పైరసీకి గురైన విషయం విదితమే. అదృష్టవశాత్తూ ఆ సినిమా ఘనవిజయం సాధించిందనుకోండి.. అది వేరే విషయం. 

ఇక, తాజాగా 'బాహుబలి-2' సినిమా విడుదలకు ముందే లీకయ్యిందన్న గాసిప్స్‌ గుప్పుమంటున్నాయి. సినిమా పైరసీ వెర్షన్‌ ఇంటర్నెట్‌లో విడుదలకు ముందే అందుబాటులో వుండబోతోందన్న ప్రచారం చిత్ర నిర్మాతల్లో టెన్షన్‌ పెంచేస్తోంది. 'ఇదిగో, ఇదే సాక్ష్యం..' అంటూ కొన్ని ఫొటోలు సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్నాయి. దీనికి సంబంధించి టైటిల్‌, దాంతోపాటుగా ప్రభాస్‌ ఫొటో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుండడం గమనార్హం. మరోపక్క, సినిమా ఇప్పటికే ప్రదర్శితమయ్యిందనే వారూ లేకపోలేదు. 

అయితే ఇదంతా ఉత్తదేననీ, ట్రైలర్‌లోంచి కట్‌ చేసి, ఆ ఫొటోల్ని పెట్టారనే వాదనా లేకపోలేదు. ఆల్రెడీ 'బాహుబలి ది కంక్లూజన్‌'కి సంబంధించి గతంలో లీకేజీ వివాదం తెరపైకొచ్చింది. సకాలంలో చిత్ర యూనిట్‌ స్పందించడంతో పెద్ద ప్రమాదమే తప్పిందనుకోండి.. అది వేరే విషయం. మరిప్పుడు, 'బాహుబలి ది కంక్లూజన్‌' లీకేజీల దెబ్బకి బలైపోకుండా, పైరసీకి గురికాకుండా ప్రేక్షకుల ముందుకొస్తుందా.? వేచి చూడాల్సిందే.

Show comments