ఫైనల్‌ నిర్ణయం చినబాబుదేనట...!

ఉగాది వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఎవరుంటారు? ఎవరు పోతారు? ఇదే చర్చ. ఈ మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ తరువాత వచ్చే సాధారణ ఎన్నికల వరకు మళ్లీ పునర్వ్యవస్థీకరణ ఉంటుందో లేదో తెలియదు. ఎప్పటికప్పుడు అదిగో ఇదిగో అంటూనే ఇప్పటివరకు నెట్టుకొచ్చారు. మంత్రివర్గం విస్తరణ జరుగుతుందని అనుకున్నప్పడల్లా కొంతమంది పేర్లు బయటకు వస్తాయి. ఫలానవారు ఉంటారని, ఫలానవారు బయటకు పోతారని, ఫలాన వారి పదవులు మారుతాయని..ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయి. వచ్చినప్పుడల్లా పాత పేర్లు మరుగునపడి మళ్లీ కొత్త పేర్లు వినబడుతుంటాయి. ఇప్పుడు మళ్లీ పాత పేర్లతోపాటు కొత్త పేర్లు వినబడుతున్నాయి. గతంలో బాగా ప్రచారం జరిగినవారి పేర్లు లేవు. ఇద్దరు ఫిరాయింపుదారులకు కూడా పదవులు ఇస్తారట...!

ఫిరాయింపుదారులతో ప్రమాణస్వీకారం చేయించనని గవర్నర్‌ నరసింహన్‌ బాబుకు నిర్మొహమాటంగా చెప్పారని గతంలో వార్తలొచ్చాయి. ఇది ఎంతవరకు కార్యరూపం దాలుస్తుందో చెప్పలేం. మంత్రివర్గంలో ఎవరుంటారు? ఎవరు పోతారు? ఎవరు అటూ ఇటూ అవుతారు? అనే విషయాలకంటే ప్రధానమైన విషయాలు రెండున్నాయి. మొదటిది ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు కమ్‌ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ మంత్రివర్గంలో చేరుతుండటం. ఎమ్మెల్సీగా కూడా ఎన్నికైన ఆయనకు సింహద్వారం తెరచియేయున్నది. ఆయనకు ఏం పదవి ఇస్తారనేది చర్చనీయాంశం. ఇక రెండోది, ముఖ్యమైంది ఏమిటంటే...మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై చినబాబు లోకేష్‌ నిర్ణయమే ఫైనల్‌ అని వినవస్తోంది. అంటే మంత్రివర్గంలో ఎవరుండాలి? ఎవరు బయటకు పోవాలి? ఎవరు అటు ఇటు కదలాలి? అనేది లోకేష్‌ నిర్ణయిస్తారట....! 

థియరీ ప్రకారం మంత్రులను నియమించే, తొలగించే అధికారం ముఖ్యమంత్రికే ఉంటుంది. కాని ఏపీలో థియరీ వేరు, ప్రాక్టికల్స్‌ వేరని కొందరు చెబుతున్న సమాచారం. 2019 ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషించబోతున్న లోకేష్‌ తనకు అనుకూలమైన, సహకరించే బృందం కేబినెట్లో ఉండాలని కోరుకుంటున్నారట...! అందుకే మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం చంద్రబాబు కుమారుడికి ఇచ్చారని అంటున్నారు. మార్పులు చేర్పుల తరువాత ఉండే మంత్రివర్గం 'ఎన్నికల కేబినెట్‌'. ఇది యువరక్తంతో, అనుభవజ్ఞులతో నిండివుడాలని లోకేష్‌ కోరుకుంటున్నారు. ఆ ప్రకారమే చేయాలని బాబు అనుకుంటున్నారు.  స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఎప్పటినుంచో మంత్రి పదవి కోరుకుంటున్నారు. స్పీకర్‌గా ఉండటం ఆయనకు తలనొప్పిగా ఉన్నట్లుంది. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌ బెడద వదలితే బాగుండునని అనుకుంటున్నారేమో...! 

కాని ఆయనకు మంత్రి పదవి ఛాన్స్‌ లేదట. అచ్చెన్నాయుడు పోర్టుఫోలియోను కుదిస్తారట. అంటే తెలంగాణలో తలసాని శ్రీనివాస యాదవ్‌కు కత్తెర వేసినట్లు వేస్తారేమో. గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయన్నపాత్రుడు పదవుల్లో మార్పులు జరుగుతాయని సమాచారం. నారాయణకు మంత్రి పదవి తీసేసి రాజధాని నిర్మాణ వ్యవహారాలు చూస్తున్న సీఆర్‌డీఏ అధిపతి పదవి కట్టబెడతారట. ఈ పని చేసే అవకాశం ఉందని చాలాకాలం క్రితమే వార్తలొచ్చాయి. నెల్లూరు జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డిని మండలి ఛైర్మన్‌ చేస్తారట...! భూమా అఖిలప్రియకు, మాగుంట శ్రీనివాసులు రెడ్డికి మంత్రి పదవులు ఇవ్వవచ్చని అంచనా.

కొల్లు రవీంద్రను తీసేసి బీద రవిచంద్ర యాదవ్‌కు పదవి ఇచ్చే ఛాన్స్‌ ఉందంటున్నారు. పీతల సుజాత భవిష్యత్తు  త్రిశంకు స్వర్గంలో ఉంది. ఒకవేళ ఆమెను తీసేస్తే తంగిరాల సౌమ్య లేదా వైసీపీ ఎమ్మెల్యే రోజా శత్రువైన అనితకు అవకాశం ఇస్తారట. రావెల కిషోర్‌ బాబును తీసేసి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను పెట్టుకుంటారట. మైనారిటీల్లో షరీఫ్‌ లేదా జలీల్‌కు (ఫిరాయింపుదారు) అవకాశం ఇస్తారట..! కిమిడి కళావెంకటరావు, సుజయకృష్ణ రంగారావు (ఫిరాయింపుదారు) పేర్లు వినబడుతున్నాయి. ఏది ఏమైనా చినబాబు త్వరగా పెద్దోడైపోతున్నట్లు అర్థమవుతోంది.

Show comments