నాని సినిమాకు ప్రచారం అక్కర్లేదట

హీరోగా నాని టైమ్ ఇప్పుడు కాస్త బాగుంది. థియేటర్ల దగ్గర కాస్త మంచి ఓపెనింగ్స్ నే వస్తున్నాయి. అందుకే అది చాలు, మళ్లీ ప్రచారం కూడా ఎందుకు దండగ అనుకుంటున్నారట మజ్ఞు నిర్మాతలు. అందుకే పెద్దగా పబ్లిసిటీ కనిపించడం లేదని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మజ్ఞుతో పాటు ధనుష్ రైల్ సినిమా కూడా విడుదలవుతోంది. 

ఆ సినిమా నిర్మాతలు కాస్త కొత్తవాళ్లు కావడంతో సినిమాను ఎలా ప్రమోట్ చేయాలన్నది పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో నాని మజ్ఞు సినిమాకు పోటీ లేదని నిర్మాతలకు ధీమా వచ్చినట్లు కనిపిస్తోంది. కానీ ఎంత ఓపెనింగ్స్ వుంటాయని అనుకున్నా, ముందుగా అసలు సినిమా విడుదలవుతున్న సంగతి జనాలకు తెలియాలి కదా? సాధారణంగా ఇందుకోసం టీవీ మాధ్యమాన్ని ఎక్కువగా నమ్ముకుంటారు. కానీ మజ్ఞు యూనిట్ అక్కడ కూడా ధీమాగా ఊరుకున్నట్లు తెలుస్తోంది. 

కానీ నాని సినిమా ఏం తెచ్చుకున్నా తొలివారంలోనే తెచ్చుకోవాలి. మలివారం హైపర్, ఆ తరువాతి వారం ప్రేమమ్, వీడు గోల్డ్ ఎహె, జాగ్వార్ ఇలా చాలా సినిమాలు వస్తున్నాయి. అందువల్ల ఫస్ట్ వీక్ సరైన ఫిగర్ సాధించకపోతే కష్టం అవుతుంది. అలా సాధించాలంటే కాస్త హైప్,హడావుడి అవసరం.

తన సినిమాకు ప్రచారం తక్కువగా వుందన్న సంగతి హీరో నాని కూడా గ్రహించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన నిర్మాతలకు తెలియ చేసినా కూడా వారు పెద్దగా పట్టించుకోలేదని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.  దీంతో మరి ఏమీ చేయలేక నాని కూడా ఊరుకున్నారట. సినిమా సూపర్ అయితే ఏమయినా నడుస్తుంది. కానీ కాస్త తేడా వస్తేనే..సమస్య అంతా.

Show comments