జనసేన… కోతి పుండు బ్రహ్మాండం!

గతంలో ఆంధ్ర రాష్ట్రానికి ప్రథమ పౌరులుగా కొంతమంది ఉత్తరాది వారు వ్యవహరించారు… ఉమ్మడి ఏపీకి డీజీపీలుగా వ్యవహరించిన వారిలో బెంగాలీలతో పాటు బోలెడంత మంది ఉత్తర భారతీయులున్నారు. తరచి చూస్తే.. ఐఏఎస్, ఐపీఎస్ కేడర్ లో బోలెడంత మంది ఉత్తరాది వాళ్లు రాష్ట్ర ప్రభుత్వ, వివిధ శాఖల ముఖ్య అధికారులుగా, జిల్లాల కలెక్టర్లుగా వ్యవహరించారు. వీటికి ఉదాహరణలుగా చెబుతూ పోతే అది పెద్ద జాబితా అవుతుంది. అందుకు ఉదాహరణలు అందరి ఎరుకలోనే ఉంటాయి. ఉమ్మడి ఏపీ పరంగా చూసినా.. ప్రతి జిల్లాకూ ఏదో ఒక సమయంలో ఉత్తరాది ఐఏఎస్ లు కలెక్టర్లుగా రావడం వెళ్లడం.. జరిగిన, జరుగుతున్న పనే!

వీరిలో మంచి పనులు చేసిన వాళ్లూ ఉన్నారు, ఏ మాత్రం  ప్రభావం చూపకుండా వెళ్లిన వారూ ఉన్నారు! అలాగే.. ఉమ్మడి ఏపీలో తెలుగు వారైన ఐఏఎస్ లే కలెక్టర్లుగా, ఇతర ముఖ్య పదవుల్లో పని చేశారు కూడా. వీరిలో కూడా మంచి పనులు చేసి చిరకాలం గుర్తుండి పోయిన వాళ్లు, ఏ మాత్రం ప్రభావం చూపకుండానే వెళ్లిన వాళ్లు ఉన్నారు. 

ఈ బ్యూరోక్రాట్ల విషయానికి వస్తే.. వీరిలో వీరికి ప్రాంతీయ విబేధాలు, అభిమానాలు ఉంటే ఉండవచ్చు గాక.. ఈ ఉత్తరాది, దక్షిణాది గోల.. వ్యవస్థకు సంబంధించినది అయితే కాదు!

మన రాజ్యాంగంలో ఇలాంటి విభజన ఏమీ లేదు. మరి ఏదో ఒక పేచీ పెట్టడానికి కాకపోతే టీటీడీ ఈవో విషయంలో ఈ లొల్లి ఏంది? దీనిపై తెలుగు న్యూస్ చానళ్లు చేస్తున్న యాగీ, జనసేన అధినేత ట్వీట్ల లొల్లి.. చూస్తుంటే, ఇప్పటికిప్పుడు ఏపీకి ఇంతకు మించిన సమస్య లేదా? అనే సందేహమే ప్రథమంగా కలుగుతుంది?

ప్రత్యేక హోదాతో మొదలుపెడితే, రైతు, డ్వాక్రా రుణమాఫీ వంటి హామీల విషయంలో అధికారంలో ఉన్న వారు ప్రజలకు చేస్తున్న ద్రోహాలతో సహా.. చర్చించడానికి బోలెడన్ని విషయాలున్నాయి. పవన్ కల్యాణ్ లాంటి వాళ్లు ప్రశ్నించాలంటే అలాంటి సబ్జెక్టులు సవాలక్ష ఉన్నాయి.

మరి అవన్నీ వదిలేసి.. వాటిపై పెగలని గొంతులు.. ఇలాంటి సమస్యను ఎందుకు సృష్టించడం ఏమిటి? ఈ బీటింగ్ అరౌండ్ ది బుష్ ఏమిటి? కోతి పుండు బ్రహ్మాండం అయినట్టుగా.. జనసేన ప్రస్తావించింది కాబట్టి… దీన్నొక అంతర్జాతీయ సమస్య గా మార్చి కొన్ని చానళ్లు(మొన్న కాటమరాయుడు ఫంక్షన్లో రెండు చానళ్ల పెద్దలు కనిపించారే, ఆ చానళ్లలో దీనిపైనే చర్చంతా) నానా యాగీ చేస్తున్నాయి. వాటిల్లో మాట్లాడే మాటలకు హద్దే లేదు!

ఉత్తరాది ఈవో కాబట్టి సంప్రదాయాలు తెలీయవట…మరి ఈ మాట వింటే, తెలంగాణ ఉద్యమప్పుడు ఆంధ్రా బ్రహ్మణులను కించపరుస్తూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యానాలు గుర్తు రాక మానవు. అప్పుడు కేసీఆర్ అలాంటి మాటలు మాట్లాడితే అతడి వేర్పాటు వాదాన్ని తూర్పారబట్టారు. అలాంటి వేర్పాటు వాదాన్ని తట్టుకోలేక నిద్రాహారాలు మానేసిన పవన్ కల్యాణ్ స్థాపించిన పార్టీ తరపు నుంచి ఇప్పుడు అలాంటి వేర్పాటు వాదపు మాటలే వినిపిస్తున్నాయి. ఇదీ కదా.. రాజకీయం అంటే!

Show comments