జాతీయ జెండాను ఎంతగా వాడేస్తే అంత దేశ భక్తుడైపోవచ్చు అని భావించాడో ఏమో కానీ.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ గత యోగా డే రోజున నేషనల్ ఫ్లాగ్ ను ఏకంగా టవల్ లాగా వాడేశాడు. మెడకు కండువా వేసుకున్నట్టుగా జాతీయ జెండాను వేసేసుకున్నాడు. దానిపై తీవ్ర దుమారమే రేగింది. జాతీయ జెండాను అలా వాడటం అవమానించడమే అని చాలా మంది మోడీపై విమర్శలు చేశారు. అయితే దాన్ని దేశ భక్తి అంటారని బీజేపీ నేతలు, మోడీ భక్తులు వాదించడం మొదలుపెట్టారు.
మోడీ కాబట్టిజాతీయ జెండాను ఎలాగైనా వాడవచ్చు అన్న శ్లేష వినిపించింది వీరి మాటల్లో. అయితే జాతీయ జెండాను మరీ తువ్వాలులా చుట్టేసి యోగా చేసేయడం ఏ మాత్రమూ సమర్థనీయం కాదు. ఈ విషయంలో మోడీని డిఫెండ్ చేసుకోవడం కూడా కష్టం అయ్యింది. అందుకే.. ఈ ఏడాది యోగా డే సందర్భంగా మాత్రం మోడీ పాత వేషానికి స్వస్తి పలికాడు. ఈ సారి కూడా మెడకు కండువా వేశాడు కానీ.. అది జాతీయ జెండా కాదు.
జాతీయ జెండా రంగులు ఈ కండువాలో కూడా ఉన్నాయి కానీ.. ఏదో డిజైన్ బాగుండేది, స్టైల్ గా కనిపిందాన్ని మెడకు వేసుకుని ప్రధానమంత్రి యోగాసనాలు వేశారు. క్రితం సారి లా ఈ సారి విమర్శలకు అవకాశం ఇవ్వకుండా జాతీయ జెండాకు సిసలైన గౌరవాన్ని ఇచ్చినట్టుగా ఉన్నారు.