పవన్ సృష్టించిన మరో టీకప్పు తుఫాను… ముగిసినట్టే!

సునామీని సృష్టించగలడని అభిమానులు అంటారు కానీ… జనసేనాధినేత టీకప్పులో తుపానులు సృష్టించడానికి పరిమితం అయిపోతున్నాడు. మామూలుగా అయితే ఆయన బయటకు రాడు.. ఏ విషయం మీదా స్పందించడు.. ఎన్నికల హామీలను బీజేపీ, టీడీపీలు అమలు చేయకపోతే ప్రశ్నిస్తా అని అప్పట్లో ప్రకటించి పూచీ పడ్డ ఈ నేత.. ఆఖరికి ఆ కూటమి ప్రత్యేకహోదా అంశంపై చేతులెత్తిసినా ఒక రోజు హడావుడి చేసి ఆ తర్వాత దాన్ని మరిచిపోయాడు. అయితే ఆ పోరాటం ముగియలేదని మాత్రం పవన్ ఇటీవల మీడియా ముందు ప్రకటించాడు. మరి ఇంతకీ ఆయన ఆ పోరాటాన్ని ఎక్కడ కొనసాగిస్తున్నాడు? తన ఫామ్ హౌస్ లోనా! 

ఇక పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రు వద్ద ఆక్వాఫుడ్ పార్క్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న స్థానికులు ఈ విషయంలో పవన్ సాయాన్ని కోరారు. తమ తో గొంతు కలపమని అన్నారు. సాధారణంగా రాజకీయ పార్టీ నేతలు ఎవరైనా ఆయా ప్రాంతాలకు వెళ్లి బాధితులను పరామర్శిస్తారు. అయితే పవన్ మాత్రం బాధితులనే తన దగ్గరకు పిలిపించుకుని ప్రెస్ మీట్ పెట్టాడు. ఏదో ఒకటి జరిగిందిలే అని బాధితులు ఆనందపడ్డారు.

అయితే ఆ ప్రెస్ మీట్ లోనే పవన్ సన్నాయి నొక్కులు నొక్కాడు. ఆక్వాఫుడ్ పార్క్ తో స్థానికులకు తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయని చంద్రబాబుకు తెలియకపోవచ్చు.. ఈ విషయం గురించి ఆయనకు సమాచారం లేకపోవచ్చు.. అని పవన్ చెప్పాడు. మరి పవన్ ది అజ్ఞానమో, అతి లౌక్యమో! 40 రోజుల నుంచి అక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి.. ఇన్ని రోజులుగా అక్కడ పోలీసులు 144 సెక్షన్ విధించారు.. ప్రతిపక్ష పార్టీలు ఈ అంశంపై చాలా ఆందోళనలు చేపట్టాయి.. అలాంటి అంశం గురించి ముఖ్యమంత్రికి తెలియకపోవచ్చు.. అని అంటూ పవన్ మరోసారి అభాసు పాలయ్యాడు.

చంద్రబాబును రక్షించుకోవడానికే పవన్ బరిలోకి దిగుతాడు తప్ప బాధితుల తరపున కాదని ఈ విధంగా స్పష్టం అయ్యింది. ఇప్పుడు విషయం ఏమిటంటే.. ఆక్వా ఫుడ్ పార్క్ ఏర్పాటు విషయంలో బాబు స్పందించేశాడు. “అబ్బే కాలుష్యం ఉండదూ.. ఇబ్బందులూ ఉండవు..’’ అంటూ ఆయన అనేశాడు. “దానికి నేనూ పూచీ..’ అని కూడా బాబు చెప్పాడు. ఆక్వా పార్క్ ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకునేది కానీ, రైతులపై కేసులు ఎత్తేసేది కానీ లేదని బాబు స్పష్టం చేశాడు. చంద్రబాబుకు తెలియకుండా ఇదంతా జరిగి ఉండవచ్చు.. అని పవన్ బాబును డిఫెండ్ చేసే యత్నం చేశాడు, ఇప్పడు బాబేమో ‘అంతా నాకు తెలుసు.. ఏం కాదు..’ అని కూడా అనేశాడు. దీనిపై ఇక పవన్ స్పందించే సీన్ ఉండకపోవచ్చు.  Readmore!

ఈ విధంగా సీఎం నుంచి పరోక్షంగా అయినా పవన్ కు సమాధానం దక్కినట్టే. ఇది వరకూ రాజధాని రైతుల భూముల విషయంలోనూ.. ప్రత్యేక హోదా విషయంలోనూ.. ఒక్కొక్క రోజు కాల్షీట్లను కేటాయించిన పవన్ తీరును బట్టి చూస్తే.. ఆక్వాఫుడ్ పార్క్ విషయంలోనూ ఆయన పోరాటం ముగిసినట్టే. టీ కప్పు తుఫాను చల్లారినట్టే! 

Show comments