రామ్‌చరణ్ హీరోగా నటించిన 'బ్రూస్‌లీ' సినిమాలో హీరోకి అక్కగా కన్పించిన కృతి కర్బందా.. ఇప్పుడు 'బ్రూస్‌లీ' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ 'బ్రూస్‌లీ' తమిళ సినిమా. తెలుగులో కృతి కర్బందా కెరీర్ దాదాపుగా అటకెక్కేసినట్లే. 'బోణీ' సినిమాతో తెలుగు తెరపై హీరోయిన్‌గా అరంగేట్రం చేసిన కృతి, పవన్‌కళ్యాణ్‌తో 'తీన్‌మార్' సినిమాలోనూ, రామ్‌తో 'ఒంగోలు గిత్త' సినిమాల్లో నటించిన విషయం విదితమే.
తెలుగులో పెద్దగా అవకాశాల్లేకపోవడంతో ప్రస్తుతం తమిళ సినిమాల్లో సెటిలయిపోయేందుకు ప్రయత్నిస్తోన్న ఈ బ్యూటీకి అక్కడా అవకాశాలు అంతంతమాత్రంగానే వస్తున్నాయి. ఎప్పుడో 2015లో ప్లాన్ చేసిన 'బ్రూస్‌లీ' ఎలాగైతేనేం, ఇప్పుడు ఈ జనవరిలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్‌కుమార్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. నిజానికి ఈ సినిమాకి ముందు 'బాషా ఎంగిర ఆంటోనీ' అనే పేరు అనుకున్నారు. అయితే, టైటిల్ విషయంలో వివాదం తలెత్తింది. దాంతో 'బ్రూస్‌లీ'గా పేరు మార్చాల్సి వచ్చింది.
ఇక, 'బ్రూస్‌లీ' సినిమా కోసం గ్లామర్‌లో రెచ్చిపోయిందట కృతి కర్బందా. త్వరలో తన 'బ్రూస్‌లీ' విడుదల కాబోతోందనీ, తమిళంలో తనకు ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుందనీ కృతి అంటోంది. తెలుగులో 'బ్రూస్‌లీ' సినిమాలో హీరోకి అక్కగా నటిస్తే, తమిళంలో 'బ్రూస్‌లీ' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండడం ఫన్నీగా వుందని కృతి మురిసిపోతోంది.