పవన్ వైఖరిపై కంభంపాటి జోక్

పవన్ వైఖరి తెలియడం లేదట..జనాలకి కాదు. రాజకీయ నాయకులకు కూడా. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ఇదే అంటున్నారు. పవన్ పోలిటికల్ స్టాండ్ అర్థం కావడం లేదని. ఆయన పబ్లిక్ ఒపీనియన్ ఇది కావచ్చు. కానీ ఆయనకు తెలియడం లేదు అంటే నమ్మాలా? పవన్ కళ్యాణ్ చెప్పనే చెప్పారు. ప్రజారాజ్యం వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకున్నానని. ఆ మధ్య ఒక్కసారి తెలుగుదేశం నాయకులను కాస్త వ్యతిరేకిస్తే చాలు ఓ సెక్షన్ ఆఫ్ మీడియా పవన్ తో ఎలా ఆడుకుందో? ఇదంతా తెలిసి కూడా పవన్ తెలుగుదేశం పార్టీకి దూరంగా, చంద్రబాబు వేలు వదిలి వెళ్లే ధైర్యం చేస్తారా? 

పైగా చాన్స్ దొరికితే చాలు భాజపాను టార్గెట్ చేస్తుండడం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబుకు తెలియదా? అది ఏ మాత్రం కనిపించడం లేదా? దాని వెనుక వున్న వైనం రాష్ట్రంలో రాజకీయాలు పరిశీలించేవారు ఎవర్నిఅడిగినా చెబుతారు. 2019 నాటికి భాజపాను రాష్ట్రంలో ఎవరికీ పనికి రాకుండా చేయడమే పవన్-బాబుల పరమ ఉద్దేశం అని. ఎందుకంటే 2019 కి హోదా ఎలాగూ రాదు. జోన్ సంగతి కూడా డవుటే. మరి అలాంటపుడు ఇంకా భాజపాతో అంటకాగితే ఓటేసేదెవరు. అలా అని దాన్ని వదిలేస్తే, ఏ జగనో, మరొకరో దాంతో అటాచ్ అయిపోతారేమో? అందుకే అస్సలు ముందుగా రాష్ట్రంలో భాజపాను చంపేయాలి. ఆ పని ఇప్పుడు పవన్ తలకెత్తుకున్నట్లు కనిపించడం లేదా? అందరికీ కనిపిస్తోంది..ఒక్క కంభంపాటి వారికి  తప్ప. 

రాష్ట్ర భాజపా జనాలకు ఈ వైనాలు అన్నీ తెలియనివి కావు. అయినా వారికి ఏ భయం లేదు. ఎందుకంటే భాజపాలోని ఒక వర్గానికి తెలుగుదేశం అండ ఎప్పుడూ వుంటుంది. వారు భాజపాలో వున్న తెలుగుదేశం మనుషులే. మంత్రి కామినేని శ్రీనివాస్ ను చూడండి..ఆయనను భాజపా మనిషి అని ఎవర్నా అనుకుంటారా? కాంగ్రెస్ కుదేలవుతుంటే పురంద్రీశ్వరిని టక్కన పార్టీలోకి తీసుకుని ఆదుకున్నది భాజపా? ఎందుకు? అస్మదీయురాలు అనే కదా? అందువల్ల సదరు వర్గానికి ఈ పార్టీ లేకుంటే ఆ పార్టీ వుండనే వుంటుంది. వారు కాక మిగిలిన వారి సంగతా? అది తెలుగుదేశానికి సంబంధించిన వ్యవహారం కాదు.

ఇవన్నీ తెలియనట్లు, పాపం, అమాయకంగా మాట్లాడుతున్నారు కంభంపాటి వారు. పవన్ వైఖరి తెలియడం లేదూ అంటూ. అయితే ఎటొచ్చి ఎటు పోతుందో తెలియదు? మోడీ గట్టి పిండం. ఏదో ఒకటి చేసి,మళ్లీ 2019 నాటికి బలంగా వుంటే, ఆ పార్టీ కూడా అవసరమే. అందుకే కంభంపాటి, వెంకయ్య, కామినేని, పురంధ్రీశ్వరి ఇలా కొందరు అటు వుంటూ, ఇటు వ్యవహారాలు చక్కబెడుతుంటారు. అందుకోసం పవన్ ఆ పార్టీని టార్గెట్ చేసినా, అదేమీ తెలియనట్లు..అర్థం కావడం లేదు అంటూ ఏదో చెబుతూ తప్పించుకుంటారు. Readmore!

Show comments