సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌ త్రిష

తమిళనాడులో జల్లికట్టు వివాదం ముదిరి పాకాన పడింది. జల్లికట్టు కావాల్సిందేనంటూ యువత రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. యువత ఆందోళనలకి సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు గొంతు కలుపుతున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, 'పెటా' సంస్థకి పలువురు సినీ ప్రముఖులు ప్రచారకర్తలుగా పనిచేశారు గతంలో. వారందరిపైనా, ఇప్పుడు తమిళ యువత తిరగబడ్తోంది. మరీ ముఖ్యంగా ఈ ఎపిసోడ్‌లో యువత నుంచి త్రిష తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది. 

మొదట్లో జల్లికట్టుని త్రిష వ్యతిరేకించినా, ఆ తర్వాత తూచ్‌ అనేసింది. త్రిష తరఫున ఆమె తల్లి వివరణ ఇవ్వడమేకాదు, త్రిష వ్యాఖ్యల్ని వక్రీకరించారంటూ పోలీసులను ఆశ్రయించారు కూడా. అయినా, త్రిషకి వ్యతిరేకంగా యువత ఆందోళనలు కొనసాగాయి. మరోపక్క, 'పెటా'కి ఎవరెవరైతే మద్దతిచ్చారో, వాళ్ళందరిపైనా యువత దుమ్మెత్తిపోశారు. 

ఈ పరిస్థితుల్లో నడిగర్‌ సంఘం రంగంలోకి దిగింది. సినీ పరిశ్రమ ఏకతాటిపై వుండి, జల్లికట్టుకి మద్దతు తెలిపితే, మొత్తంగా తమిళ సినీ నటులంతా ఈ వివాదం నుంచి బయటపడ్తారనే ఆలోచన చేసింది. ఇంకేముంది, నడిగర్‌ సంఘం జల్లికట్టుకి అనుకూలంగా చేసిన చిన్నపాటి 'ఆందోళన'కి దాదాపుగా అందరు సినీ ప్రముఖులూ హాజరయ్యారు. వీరందరిలోకీ త్రిష సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌ కావడం గమనార్హం. 

త్రిష అలా నడిగర్‌ సంఘం కార్యాలయంలోకి ఎంటర్‌ అవుతూనే, అక్కడ గుమికూడిన యువత ఆమెకు వ్యతిరేకంగా నినదించారు. దాంతో, తాను జల్లికట్టుకి వ్యతిరేకం కాదనీ, గతంలో 'పెటా'కి ప్రచారకర్తగా పనిచేసిన మాట వాస్తవమేననీ, తాను జల్లికట్టుని ఇప్పుడు పూర్తిగా సమర్థిస్తున్నాననీ చెప్పుకొచ్చింది. ఆందోళనకారుల్ని పలువురు సినీ ప్రముఖులు వారించడంతో వివాదం సద్దుమణిగిందనుకోండి.. అది వేరే విషయం. 

కొసమెరుపు: జల్లికట్టు కోసం యువత పోరాడుతోందనీ, సినీ ప్రముఖులు ఆ క్రెడిట్‌ని కొట్టేయాలని ప్రయత్నించొద్దంటూ ప్రముఖ సినీ నటుడు కమల్‌హాసన్‌ సెటైర్‌ వేసేశారండోయ్‌. మొట్టమొదట జల్లికట్టుపై సానుకూల వ్యాఖ్యలు చేసింది ఆయనే మరి.

Show comments