వైఎస్ వీరాభిమానిగా, ఎందరు జగన్ ను వీడినా తాను మాత్రం వీడకుండా కొనసాగిన నాయకుడు కొణతాల రామకృష్ణ. అయితే అలాంటి వాడిని కూడా జగన్ దూరం చేసుకున్నారు. దాంతో రామకృష్ణ లాంటి కాస్త క్లీన్ చిట్ వున్న వాడు తమతో వుంటే విశాఖ కార్పొరేషన్ లో పనికి వస్తుందని దగ్గరకు తీసే ప్రయత్నం చేసారు లోకేష్. కానీ గంటా వర్గం ఎందుకో అడ్డం పడింది. పైగా మాజీ మంత్రి దాడి కూడా తెలుగుదేశంలోకి రావాలనుకున్నారు. దాంతో కొణతాల వైనం డోలాయమానంలో పడింది. అప్పటి నుంచి కొణతాల తటస్థంగా వుండిపోయారు. మధ్యలో ఓసారి ఉత్తరాంధ్ర సమస్యలపై ఉద్యమిస్తా అన్నారు. కానీ ఆ తరువాత మళ్లీ మౌనం వహించారు. అదే ఉత్తరాంధ్ర సమస్యలతో ఒకటి రెండు వ్యాసాలు తెలుగుదేశం అనుకూల దినపత్రికలకు అందించారు కూడా. కానీ చివరాఖరకు తెలుస్తున్నది ఏమిటంటే, కొణతాల 'దేశ'ప్రవేశం ఇక లేనట్లే అని. వుంటే గింటే విశాఖ కార్పొరేషన్ ఎన్నికల లోపు వుండాలి. కానీ వుండదనే తెలుస్తోంది.
దీనికి తోడు దేశంలోని కొణతాల రావడాన్ని వ్యతిరేకించేవారు కానీ, మిగిలిన నాయకులు కానీ రెండేళ్ల తరువాతి వ్యవహారానికి ఇప్పటి నుంచే పనులు స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. డైరీ చైర్మన్ ఆడారి తులసీరావు ఎంపీ సీటుపై కన్నేసినట్లు కనిపిస్తోంది. ఆయన ఇప్పటి నుంచే అనకాపల్లి ఎంపీ నియోజకవర్గం పరిథిలోని ప్రజల్లో తన పట్టు, పలుకుబడి పెంచుకునే పనిలో పడ్డారని వినికిడి. ఇక ఎమ్మెల్యే గా కొణతాలకు అత్యంత సమీప బంధువే వున్నారు. ఆయనకు కాదని కొణతాలకు టికెట్ ఇస్తారా అన్నది అనుమానమే. ఆశించడం కూడా కొణతాలకు సరికాకపోవచ్చు.
అందువల్ల తెలుగుదేశంలోకి ఏమి ఆశించి వెళ్లాలి కొణతాల అంటే అనుమానమే. పైగా కొణతాల రారనే ధీమా వుండబట్టే కదా ఆడారి తులసీరావు ఇప్పటి నుంచే ఎంపీ సీటుకు గాలం వేయడం ప్రారంభించింది. మరి ఇక కొణతాలకు డెస్టినేషన్ ఏమిటి? కొత్తపార్టీ జనసేన, భాజపా వ్యవహారాలు అన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తెలుగుదేశంతో ముడిపడి వుంటాయి. అందువల్ల అటు వెళ్తారా? వెళ్లరా? అన్నది తేలాల్సి వుంది. వైకాపా కూడా కొణతాలను దగ్గరకు మళ్లీ తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు లేదు. వెళ్లిన వాళ్లను వెళ్లనివ్వడమే తప్ప, పార్టీ కోసం మెట్టు దిగే పని జగన్ కు అలవాటు లేదు. అదే వైకాపాకు అసలు సమస్య అయినా, జగన్ మారరు.
అందువల్ల ప్రస్తుతానికి కొణతాల అలా ఎవరికీ చెందకుండా వుండిపోవడమే. అధికారపార్టీ ఎమ్మెల్యేతో బంధుత్వం వుంది కాబట్టి, రాజకీయంగా పెద్ద సమస్యలు రావు. ఎన్నికలు దగ్గరకు వచ్చాక, ఎక్కడ అవకాశం వుంటే అక్కడకు వెళ్లడమే ఆయన ఎజెండా కావచ్చు.
కొణతాల 'దేశా'నికి దూరమే?
Show comments