ఈ బొంకుడుకి హద్దూ అదుపూ లేదా.?

సిఐఐ భాగస్వామ్య సదస్సు పేరు చెప్పి దాదాపు పదిన్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన 'ఎంఓయూ'లు కుదిరాయని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటోన్న విషయం విదితమే. ఇందులో ఆరు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించినవేనట.! ఇదీ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుగారి ఉవాచ.! 

అసలు, సిఐఐ భాగస్వామ్య సదస్సు పేరు చెప్పి కుదురుతోన్న 'ఎంఓయూ'లలో నిజమెంత.? ఇది మేడిపండు చందం కాదు కదా.? అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్న వేళ, వెంకయ్యనాయుడు 'బొంకుతున్న తీరు' అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. దేశ చరిత్రలోనే సిఐఐ సదస్సు రెండోసారి ఒకే రాష్ట్రంలో జరగడం ఎన్నడూ లేదని, ఆంధ్రప్రదేశ్‌ పట్ల కేంద్రం చూపుతున్న ప్రత్యేకమైన శ్రద్ధకు ఇది నిదర్శనమనీ, కేంద్రం పట్టుదలతోపాటు, చంద్రబాబు ఒత్తిడీ సిఐఐ సదస్సు రెండోసారి విశాఖలో జరగడానికి కారణమని సెలవిచ్చారు వెంకయ్యనాయుడు. 

గతంలో సిఐఐ భాగస్వామ్య సదస్సు జరిగింది. అప్పుడూ ఇలాగే లక్షల కోట్ల రూపాయల లెక్కల్ని చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. అందులో, ఎన్ని ఒప్పందాలు కార్యరూపం దాల్చాయి.? అన్న ప్రశ్నకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే సమాధానం చెప్పడంలేదాయె. కానీ, వెంకయ్యనాయుడు మాత్రం.. ఒప్పందాలు ఆషామాషీగా జరగట్లేదనీ, ఈసారి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కుదుర్చుకున్న ఒప్పందాలే నిదర్శనమని చెబుతున్నారు. 

అర్థరాత్రి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్యాకేజీ ప్రకటించడమేంటి.? దానర్థం అందులో చిత్తశుద్ధి లేదనే కదా.? అంటూ పాత మిత్రుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ ఇటీవల ప్రశ్నించడమ్మీదా వెంకయ్యనాయుడు స్పందించారు. అర్థరాత్రి ప్రకటన అనే విమర్శల్లో అర్థం లేదని, అరుణ్ జైట్లీ పార్లమెంటులోనే ప్యాకేజీని ప్రకటించారనీ, ఎప్పుడు ప్రకటించారన్న విషయం పక్కన పెడితే, ఆ ప్రకటనలోని అంశాలన్నీ, ఆంధ్రప్రదేశ్‌కి మేలు చేయడం కోసమేనని చెప్పుకున్నారాయన. 

ప్రత్యేక హోదాని తొలుత అడిగింది తానేననీ, అయితే అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు మారాయనీ చెబుతున్న వెంకయ్య, ఇప్పటిదాకా 'ప్రత్యేక హోదాని అటకెక్కించడానికి 14వ ఆర్థిక సంఘం సూచనలే కారణం' అని బీజేపీ చేసిన వ్యాఖ్యల్ని సవరించారు. అదేమీ, ప్రత్యేక హోదా వద్దని చెప్పలేదంటూ బుకాయించారు. ప్రత్యేక హోదా వల్ల ఆయా రాష్ట్రాలు అదనంగా లాభపడ్డదేమీ లేదన్నమాటే 14వ ఆర్థిక సంఘం చెప్పిందని వెంకయ్య ఇప్పుడు కొత్త కథ చెబుతుండడం గమనార్హం. 

మొత్తమ్మీద, మాట మీద నిలబడటం.. అన్న మాటే మర్చిపోయారు వెంకయ్యనాయుడు. ఓ సారి రెండున్నర లక్షల కోట్ల రూపాయల విలువైన ప్యాకేజీ ఇచ్చామంటారు.. ఆ తర్వాత అది ప్యాకేజీ కాదు, ఆంధ్రప్రదేశ్‌ తమకు ప్రత్యేక రాష్ట్రం గనుక, ఆ రాష్ట్ర అభివృద్దిని కాంక్షిస్తూ అందిస్తున్న ప్రత్యేక సహాయం అంటారు. చట్టబద్దత సంగతేంటని ప్రశ్నిస్తే, కేంద్ర మంత్రి ప్రకటించాక చట్టబద్ధత ఏంటి.? అని ఆయనే మాట్లాడతారు. అలాగైతే, ప్రత్యేక హోదాపై అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రకటించారు కదా.? అనడిగితే, చట్టంలో పెట్టలేదు కాబట్టి, దానికి చట్టబద్ధత లేదంటారు.. ఏంటో, వెంకయ్య.. రాను రానూ ఆయన బొంకుడుకి హద్దూ అదుపూ లేకుండా పోతోంది.

Show comments