విశాఖపట్నంలో బీచ్ లవ్ పేరుతో భారీ ఈవెంట్‌కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. విశాఖను అంతర్జాతీయ నగరంగా మార్చుతామంటూ ఇప్పటికే చాలా ఈవెంట్స్‌ని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించారు. అందులో ఇండియన్ ఫ్లీట్ రివ్యూ ముఖ్యమైనది. సిఐఐ బాగస్వామ్య సదస్సు, ఇంకొన్ని అంతర్జాతీయ సదస్సుల్ని నిర్వహించడం ద్వారా విశాఖ పేరు కాస్తో కూస్తో అంతర్జాతీయ స్థాయిలో మార్మోగేందుకు అవకావం ఏర్పడిన మాట వాస్తవం.
నిజానికి విశాఖ ఈ రోజు కొత్తగా ప్రముఖ నగరం అయిపోలేదు. దురదృష్టవశాత్తూ హైద్రాబాద్ మీద ప్రేమతో, పాలకులు విశాఖను పక్కన పడేశారుగానీ, విశాఖ దేశంలోని ఏ ఇతర ముఖ్య నగరాలకీ తీసిపోదన్నది నిర్వివాదాంశం. కారణాలైవేతేనేం, ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయాక, విశాఖకు ప్రాధాన్యత ఏర్పడింది. అయినాసరే, విశాఖపై చిన్నచూపు మాత్రం యదాతథంగా కొనసాగుతూనే వుంది. ఈవెంట్స్ తప్ప, విశాఖ వేదికగా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలైతే అక్కడ జరగడంలేదు.
ఇక, బీచ్ లవ్ విషయానికొస్తే.. దీని చుట్టూ పెద్ద దుమారమే రేగుతోంది. బీచ్‌నీ లవ్‌నీ కలిపితే ఇంకేమన్నా వుందా.? అదో పెద్ద రచ్చ అవడం మామూలే. బీచ్ అంటే బికినీలు.. లవ్ అంటే, హద్దులు దాటిపోవడమే. ఆ రెండినీ కలిపేస్తే, విశాఖ బీచ్ గోవా బీచ్‌ని మించిపోవడం ఖాయం. ఇక్కడే వస్తోంది చిక్కు అంతా. మహిళల్ని అర్ధనగ్నంగా చూపించే ఇలాంటి ఈవెంట్స్ అవసరమా.? అన్న చర్చ జరుగుతోంది.
ఓసోస్, ఇదో పెద్ద వివాదమా.? అనేవారూ లేకపోలేదు. అవును మరి, సినిమాల్లో చూడట్లేదా.? సినిమాలదాకా ఎందుకు షాపింగ్ మాల్స్‌కి వెళితే చాలు, అక్కడ సినిమాని మించిన గ్లామర్ కన్పిస్తోంది. హైద్రాబాద్, విశాఖ, విజయవాడ ఎక్కడ చూసినా ఇప్పుడు గ్లామర్ ఎక్కువైపోయింది. ఇదేం పైత్యం.? అని ప్రశ్నించారో ఖబడ్దార్.. మీరంతా మహిళా వ్యతిరేకులైపోతారు. 'ఏం, మగాళ్ళే జబ్బల్లేని బనియన్లు వేసుకోవాలా.?' అని ప్రశ్నించే మహిళా సంఘాలూ వున్నాయండోయ్.
ఆ లెక్కన, బీచ్ లవ్ ఈవెంట్ విషయంలో ఓ పక్క రచ్చ, ఇంకోపక్క సమర్థన తప్పదు. ఎవరి గోల వారిది. చివరకు మిగిలేది ఎంజాయ్‌మెంట్ మాత్రమే. ఛీ..ఛీ.. అని తిట్టుకున్నోళ్ళే, ఆ ఈవెంట్‌ని సూపర్ హిట్ చేసేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదంతా బాగానే వుంది, ఇది పద్దతా.? కాదా.? అన్నది ప్రభుత్వమే ఆలోచించుకోవాల్సి వుంటుంది. బీచ్ లవ్ పేరుతో, పాశ్చాత్య పోకడల్ని, వెర్రి వేషాల్ని కొత్తగా పరిచయం చేస్తున్నారని అనలేంగానీ, దానికి పాపులారిటీ కల్పించడం వల్ల విశాఖ పేరు పెరుగుతుందా.? నాశనమైపోతుందా.? అన్నదీ ప్రభుత్వం ఆలోచించుకోవాలి.
ఇప్పటికే విశాఖ సహా, సముద్ర తీర ప్రాంతాల్లో అసాంఘీక కార్యకలాపాలు పెరిగిపోయాయి. అసభ్యకార్యకలాపాలతో సాధారణ ప్రజానీకం అటువైపు వెళ్ళలేని పరిస్థితి. బీచ్ లవ్.. అంటూ అసభ్యతకు రెడ్ కార్పెట్ వేసేస్తే, ఇక మాట్లాడుకోడానికి ఏమీ వుండదు. ఓసోస్, విదేశాల్లో ఇలాంటివి మామూలే కదా.. అంటారా.? మనది భారతదేశం. ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలు వేరు కదా.!