పాకిస్తాన్‌కి అంత సీనెక్కడిది.?

'భారత్‌పై ఏ క్షణాన అయినా అణుదాడికి మేం సిద్ధం.. అది భారత్‌ వ్యవహరించే తీరుపై ఆధారపడి వుంటుంది. అణ్వాయుధాల్ని ఆటవస్తువులుగా భావించడంలేదు.. వాటిని డెకరేషన్‌ కోసం తయారుచేసుకుని పెట్టుకోలేదు.. ఖబడ్దార్‌ ఇండియా..' అంటూ పాకిస్తాన్‌ నిన్న మొన్నటిదాకా పిచ్చిప్రేలాపనలు చేస్తూ వచ్చింది. 

నిజమేనా.? పాకిస్తాన్‌ వద్ద ఆ స్థాయిలో అణు దాడుల సామర్థ్యం వుందా.? పాకిస్తాన్‌ వైమానిక సత్తా ఎంత.? పాకిస్తాన్‌ నేవీ బలమెంత.? పాకిస్తాన్‌ ఆర్మీ, భారత్‌ని ఎదుర్కొనేంత బలం వుందా.? అని లెక్కలు తీస్తే, ఏ కోశానా పాకిస్తాన్‌కి అంత సీనే లేదనే విషయం బయటపడ్తుంది. 

అంతర్జాతీయ సమాజం, పాకిస్తాన్‌లో అణ్వాయుధాలు భారత్‌కన్నా ఎక్కువే వుండొచ్చన్న అనుమానం వ్యక్తం చేస్తున్నమాట వాస్తవం. కానీ, ఆ స్థాయిలో పాకిస్తాన్‌ వద్ద ఆయుధ సంపత్తి వుంటే, సీమాంతర తీవ్రవాదాన్ని ఎగదోయడం కాదు, ఎప్పుడో భారత్‌పై అణుదాడి చేసేసే వుండేది. లేదా, తీవ్రవాదుల చేతికి అణ్వాయుధాలిచ్చి, అణుదాడి చేయించేసే వుండేది. 

నిజానికి, భారత్‌ ఎప్పుడూ పాకిస్తాన్‌ని ప్రత్యర్థిగా చూడలేదు. అణు జలాంతర్గాముల్ని స్వయంగా తయారుచేసుకోవాలన్న ఆలోచన అయినా, సుదూరంలో వున్న లక్ష్యాల్ని ఛేదించే క్షిపణుల్ని తయారుచేస్తున్నా, అత్యాధునిక యుద్ధ విమానాల్ని సొంతంగా రూపొందించుకునేందుకు ప్రయత్నిస్తున్నా.. ఇదంతా చైనాని ఎదుర్కొనేందుకు మాత్రమే. ఇది బహిరంగ రహస్యం. 

సర్జికల్‌ స్ట్రైక్స్‌ నిర్వహిస్తేనే, పాకిస్తాన్‌ నోట మాట పడిపోయింది. యుద్దంలో పలుమార్లు చావుదెబ్బ తిన్న పాకిస్తాన్‌కి, భారత్‌ శక్తి ఏంటో బాగా తెలుసు. తీవ్రవాదాన్ని పెంచి పోషించడం, తద్వారా భారత్‌లో అలజడి సృష్టించడం.. ఇంతకు మించి, పాకిస్తాన్‌, భారత్‌ని ఏమాత్రం దెబ్బతీయలేదు. ఆ విషయం మరోమారు స్పష్టమయ్యింది. లేదంటే, సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిగిన వెంటనే పరిస్థితి ఇంకోలా వుండేది. 

Show comments