రజనీకాంత్‌కి అంత ధైర్యమెక్కడిది.!

ఆయన 'ఊ..' అనాలేగానీ, జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలూ ఆయనకి రెడ్‌ కార్పెట్‌ వేసేస్తాయి. అడిగితే, ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి అయినా ఆయనకు ఇచ్చేయడానికి కొన్ని పార్టీలు సిద్ధంగా వున్నాయి. కానీ, ఆయనకి రాజకీయాలంటే ఒకింత 'ఇది'. ఆ 'ఇది' ఏంటి.? అన్నది ఆయనొక్కరికే తెలుసు. అది భయమా.? అయిష్టమా.? ఇంకేదన్నానా.? అన్నదానిపై రకరకాల వాదనలున్నాయి. 

ఆయనెవరో కాదు, తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌. పార్టీ పెడితే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ.. అనే పరిస్థితుల్లోనూ ఆయన రిస్క్‌ చేయలేదు. కారణం, రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి వుండే సానుకూల పరిస్థితులు, వచ్చాక వుండకపోవచ్చు. అది రజనీకాంత్‌కి బాగా తెలుసు. స్వతహాగా కొంత భయస్తుడు కావడంతో, రాజకీయాల పట్ల అంత ఆసక్తి ప్రదర్శించలేదాయన. 

తమిళనాడులో ప్రస్తుతం రాజకీయాలు వేడెక్కాయి. జయలలిత మరణం తర్వాత రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది. రజనీకాంత్‌ ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తే ముఖ్యమంత్రి అవడం ఖాయమని ఆయన అభిమానులు భావిస్తున్నారు. ప్రతిపక్షం డీఎంకే కూడా రజనీకాంత్‌కి లైనేస్తోంది. కాంగ్రెస్‌, బీజేపీ సంగతి సరే సరి. అధికార అన్నాడీఎంకే పార్టీ కూడా రజనీకాంత్‌ అంటే ప్రత్యేకమైన అభిమానం ప్రదర్శిస్తుందనుకోండి.. అది వేరే విషయం. 

ఇక, తాజాగా రజనీకాంత్‌ ఫొటోలతో తమిళనాడులో అక్కడక్కడా 'పొలిటికల్‌' పోస్టర్లు వెలుస్తున్నాయి. రజనీకాంత్‌ని రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు అభిమానులంతా ఒక్క తాటిపైకి రావాలన్నది ఆ పోస్టర్స్‌ సారాంశం. ఈ వ్యవహారం ఇప్పటికే రజనీకాంత్‌ దగ్గరకు వెళ్ళిపోయిందట. ఆయన మాత్రం, 'మౌనమే బెటర్‌..' అన్న మాటకు కట్టుబడిపోయారు. అఫ్‌కోర్స్‌, ఇంతకన్నా చాలా చాలానే చూసేశారు రజనీకాంత్‌. అభిమానుల ఆందోళనలు, ధర్నాలు కూడా గతంలో జరిగాయిగానీ, రజనీకాంత్‌ ఎప్పుడూ రాజకీయాలపై ఆసక్తి చూపలేదు. 

ఏదిఏమైనా, రాజకీయాల్లోకి రావాలంటే తెగింపు రావాలి.. ప్రజా సమస్యలపై అవగాహన వుండాలి.. అన్నిటికీ మించి రాజకీయాల్లో నెగ్గుకురాగల వ్యూహచతురత వుండాలి. లేకపోతే ఏమవుతుందో, తమిళనాడులోనే విజయ్‌కాంత్‌ రూపంలో ఓ ఎగ్జాంపుల్‌ అందరికీ అక్కడ కన్పిస్తుంది కదా.!

Show comments