పవన్‌కళ్యాణ్‌.. సినిమానా? రాజకీయమా?

'మీరు మానెయ్యమంటే సినిమాలు మానేస్తాను.. నన్ను మీరే పోషించాల్సి వుంటుంది.. అందుకే సినిమాల్లో కొనసాగుతాను..' అంటూ కాకినాడలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్‌కళ్యాణ్‌ ప్రకటించిన విషయం విదితమే. అంతకు ముందు తిరుపతి బహిరంగ సభలో, 'డబ్బుల్లేవు.. మీరు నా సినిమాల్ని గట్టిగా చూడండి..' అంటూ మరో జోకేశాడు పవన్‌. 

సినిమాలు చూడమంటున్నారు సరే, సినిమాలేవీ.? ఇదీ ఇప్పుడు అభిమానులనుంచి దూసుకొస్తోన్న ప్రశ్న. ప్రస్తుతానికైతే 'కాటమరాయుడు' సినిమా అనౌన్స్‌ అయ్యింది. ఆ సినిమా షూటింగ్‌ ప్రారంభమయ్యిందట ఇప్పటికే. అయితే అది 'అట' మాత్రమే. ఎస్‌జె సూర్య చెయ్యాల్సిన సినిమా చివరి నిమిషంలో అటకెక్కి, డాలీ సినిమా 'కాటమరాయుడు' సెట్స్‌ మీదకు వచ్చిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! 

'కాటమరాయుడు' సంగతిలా వుంటే, తదుపరి రాజకీయ వ్యూహాలపై పవన్‌కళ్యాణ్‌ కిందా మీదా పడుతున్నారిప్పుడు. 'తిరుపతిలో మీటింగ్‌ పెట్టాం.. మంచి రెస్పాన్స్‌ వచ్చింది.. కాకినాడ మీటింగ్‌కీ మంచి రెస్సాన్సే వచ్చినా, అక్కడ సరిగ్గా మాట్లాడలేకపోయాం..' అంటూ పవన్‌కళ్యాణ్‌ తనను తాను ప్రశ్నించుకుంటున్నాడట ఇప్పుడు. ఏం సాధించినా ప్రత్యేక హోదా వచ్చే పరిస్థితుల్లేకపోవడంతో, ప్యాకేజీని అర్థం చేసుకుని సరిపెట్టుకుంటే, సినిమాల్లో కొనసాగొచ్చన్నది పవన్‌కళ్యాణ్‌కి సన్నిహితులు ఇస్తున్న సూచన అట. 

మరోపక్క, ప్యాకేజీని అర్థం చేసుకోవడానికి పవన్‌కళ్యాణ్‌ కొంతమంది నిపుణుల బృందాన్ని నియమించినట్లు తెలుస్తోంది. ఆ నిపుణుల బృందం నివేదిక ఇచ్చేలోపల, పవన్‌కళ్యాణ్‌ 'కాటమరాయుడు' షూటింగ్‌ షెడ్యూల్‌లో పాల్గొంటాడన్నది ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ సమాచారమ్‌. నిజమేనా.? సినిమా - రాజకీయం.. అనే రెండు పడవల మీద పవన్‌కళ్యాణ్‌ సేఫ్‌ జర్నీ చేయగలరా.? వేచి చూడాల్సిందే.

Show comments