రోజా కోసం స్పెషల్‌ టీమ్‌.!

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ప్రతిపక్షం తరఫున గట్టిగా మాట్లాడే నేత ఎవరు.? అంటే, ఠక్కున గుర్తుకొచ్చే పేరు రోజా అనే. నగిరి ఎమ్మెల్యే అయిన రోజా, గతంలో తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా పనిచేశారు. ఇప్పుడామె వైఎస్సార్సీపీ మహిళా అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. చంద్రబాబుని విమర్శించడంలో ఆమె 'పీహెచ్‌డీ' చేసేశారనడం అతిశయోక్తి కాదేమో.! చేసే విమర్శల్లో స్ట్రెయిట్‌నెస్‌' రోజా ప్రత్యేకత. గుక్క తిప్పుకోకుండా ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించే రోజాని కంట్రోల్‌ చేయడానికి అధికార పక్షం గడచిన మూడేళ్ళుగా నానా తంటాలూ పడ్తూనే వుంది. 

రోజాని, అసెంబ్లీలో తట్టుకోవడం కష్టంగా మారడంతో, ఏడాదిపాటు తెలివిగా టీడీపీ సస్పెండ్‌ చేయించాల్సి వచ్చిన విషయం విదితమే. ఇప్పుడు కొత్త రాష్ట్రంలో కొత్త అసెంబ్లీ సమావేశాలు.. అమరావతి వేదికగా జరగనున్న ఈ అసెంబ్లీ సమావేశాల్లో రోజాని టార్గెట్‌ చేయడానికి, ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఓ 'టీమ్‌'ని ఏర్పాటు చేశారట. ఆ టీమ్‌లో ఎవరుంటారు.? అన్న ప్రశ్నకి సమాధానం వెతకడం పెద్ద కష్టమేమీ కాదు. 

ఇప్పటిదాకా ఆంద్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల్లో రోజాపై విరుచుకుపడ్తున్న మంత్రి కింజరాజు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బొండా ఉమామహేశ్వరరావులతో పాటు, మహిళా ఎమ్మెల్యే అనితనీ ఈ కమిటీలో వేశారట చంద్రబాబు. అనిత వివాదం కారణంగానే, అసెంబ్లీ నుంచి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా సస్పెండ్‌ అయ్యారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ మాటకొస్తే, ఆ వివాదంతోనే అనిత కూడా పొలిటికల్‌గా హైలైట్‌ అయ్యారనుకోండి.. అది వేరే విషయం. 

కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌పై ప్రభుత్వాన్ని నిలదీయడమే రోజా చేసిన నేరం.. పుష్కరాల్లో తన పబ్లిసిటీ కోసం సామాన్యుల్ని చంద్రబాబు బలిపెట్టారని విమర్శించడమే రోజా చేసిన పాపం. ఈ మధ్యకాలంలో జరిగిన చాలా విషయాలు, ప్రతిపక్షానికి.. మరీ ముఖ్యంగా రోజాకి ఆయుధాలుగా దొరికాయి. మహిళా పార్లమెంటేరియన్‌ సదస్సుకి పిలిచి అవమానించడం, టీడీపీ మహిళా ప్రజా ప్రతినిధి జానీమూన్‌పై మంత్రి రావెలకిషోర్‌ వేధింపులు, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి చెందిన దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదం.. వీటిపై రోజా ప్రశ్నించి, మరో నేరం (?!) చేస్తారా.? ఏమోగానీ, రోజా కోసం ఏర్పాటైన కమిటీ మాత్రం, ఆమెను 'ఉచ్చులోకి' లాగడం ఖాయం.

Show comments