చంద్రబాబునాయుడు రెండు కళ్ల సిద్ధాంతాన్ని మరోసారి బయటకు తీశాడు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రా, తెలంగాణ తనకు రెండు కళ్లని చెప్పుకుని రాష్ట్రం ముక్కలయ్యేందుకు పూర్తిగా సహకరించాడు. తెలుగుదేశం లేఖ రాయడం వల్లే తెలంగాణ వచ్చిందని తెలంగాణలో, జగన్ మోహన్‌రెడ్డి వల్లే రాష్ట్రం విడిపోయిందని ఆంధ్రాలో ప్రచారం చేసి ప్రజల్ని ఏమార్చాడు. ఇప్పుడు మళ్లీ ఇదే రెండు కళ్ల సిద్ధాంతాన్ని ఏపీలో అప్లయి చేస్తున్నాడు. పోలవరం, అమరావతి రెండు కళ్లుగా చెప్పుకుంటూ బాబు మరో నాటకానికి తెరతీశాడని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
పోలవరం ప్రాజెక్టు పూర్తిగా కేంద్ర నిధులతో నిర్మతమయ్యే ప్రాజెక్టు. రాష్ట్ర విభజన బిల్లులో చెప్పిన విధంగా ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను తీసుకుని తామే పూర్తి పనులు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అక్కడే బాబు స్కెచ్ మార్చాడు. కేంద్రమే ప్రాజెక్టు నిర్మిస్తే ఆ క్రెడిట్ అంతా కేంద్రంలోని బీజేపీకి వెళ్తుంది తద్వారా ప్రజల్లో ఆపార్టీకి ఆదరణ పెరుగుతుంది. అలా జరగడానికి వీల్లేదు. పోలవరం క్రెడిట్ అంతా తన వ్యక్తిగత ఖాతాలో పడిపోవాలనేది బాబు ప్లాన్. దాని ప్రకారం ప్రాజెక్టుకు అవసరమయ్యే నిధులు ఇస్తే చాలు నిర్మాణం సంగతి రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుందని కేంద్రాన్ని బతిమాలాడు.
బాబు జిమ్మిక్కులు తెలిసిన బీజేపీ దీన్ని వ్యతిరేకించింది. కానీ వెంకయ్యనాయుడు ద్వారా లాబీయింగ్ చేసుకుని ప్రాజెక్టు నిర్మాణ పనిని చేజిక్కిచుకోవడంలో బాబు సఫలమయ్యాడు. తమ పార్టీ నేత రాయపాటి సాంబశివరావుకు చెందిన నిర్మాణ సంస్థ ట్రాన్స్‌టాయ్‌కు పోలవరం పనులు కాంట్రాక్టు కట్టబెట్టాడు. ఇష్టానుసారం నిర్మాణ వ్యయాన్ని పెంచేశాడు. దీని వల్ల రెండు లాభాలు ఒకటి.. ట్రాన్స్‌టాయ్ నుంచి దండిగా ముడుపులు.. రెండు.. రేపు ప్రాజెక్టు పూర్తయితే టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు గొప్పతనంగా బిల్డప్పులు..
ఇక అమరావతి సంగతి చూద్దాం.. అమరావతి నగర నిర్మాణంలో బాబు గారు చేసింది కాస్త అటు ఇటుగా దళారి పాత్ర. భూములు ప్రజలవి. నిర్మించేది సింగపూర్‌కు చెందిన కంపెనీ. ఇందులో బాబు చేసేది మధ్యవర్తిత్వం మాత్రమే. రైతుల దగ్గర నుంచి దాదాపు 50 వేల ఎకరాల భూమిని ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ పేరిట బలవంతంగా సేకరించింది. భూములివ్వని రైతులను బెదిరించింది. పంటలు తగలబెట్టించి భయపెట్టింది. కోర్టుకు వెళ్లిన వారిని వేధించింది. ఇలా బలవంతంగా సేకరిచిన భూములను తీసుకెళ్లి సింగపూర్ కంపెనీ చేతిలో పెట్టింది.
అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దే బాధ్యత సింగపూర్ ప్రభుత్వానిదేనన్న మాట. ఇక్కడ కూడా బాబుకు రెండు రకాల లాభాలు. తన కోటరీ చేత ముందుగానే రైతుల వద్ద నుంచి అతి తక్కువ ధరలకే వందల ఎకరాల భూములను కొనుగోలు చేయించి కోట్ల రూపాయల సంపాదించాడు. ఇప్పుడు అవే భూములను సింగపూర్ కంపెనీలకు అంజేసి అక్కడ నుంచి భారీ స్థాయిలో కమిషన్లు సొమ్ముచేసుకుంటున్నాడు. ఇదీ బాబు గారి రెండు కళ్ల సిద్ధాంతం.
తనకు ప్రయోజనం లేనిదే ఏ పనీ చేయని బాబు ప్రతిదీ ప్రజల కోసం చేస్తున్న త్యాగంగా కలరింగ్ ఇవ్వడం.. దానికి ఆస్థాన మీడియా వంత పాడడం.. ఇదీ వరస.