ఎమ్బీయస్‌: చట్టాన్ని చేతిలోకి తీసుకున్న కేరళ న్యాయవాదులు

గత మూడు నెలలుగా కేరళలోని కోర్టుల్లో మీడియాను అనుమతించటం లేదు. ఆ నిర్ణయం తీసుకున్నది న్యాయాధిపతులు కాదు, న్యాయవాదులు! పత్రికా స్వేచ్ఛను హరించడం సబబు కాదని ముఖ్యమంత్రి కాదు, చీఫ్‌ జస్టిస్‌ కాదు ఎవరు చెప్పినా వాళ్లు ఖాతరు చేయడం లేదు. సమాచార సేకరణకై కోర్టు ఆవరణలో రావచ్చో, ఎవరు రాకూడదో వాళ్లే నిర్ణయిస్తారట. దీనికి మూలం జులై 14 నాటి ఒక సంఘటన. ఆ రోజు ధనేశ్‌ మాత్యూ మంజూరన్‌ అనే గవర్నమెంటు ప్లీడరు ఎర్నాకులంలోని కాన్వెంట్‌ జంక్షన్‌లో 45 ఏళ్ల ఒక మహిళపై అత్యాచారం (మోలెస్టేషన్‌ అన్నారు, ఏ మేరకు అత్యాచారమో తెలియరాలేదు) చేస్తూండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వాళ్లు ఆ మహిళ ఫిర్యాదును నమోదు చేసుకుని దాని ప్రకారం ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేసి అరెస్టు చేశారు. తర్వాత మంజూరన్‌ తండ్రి ఆమెను కలిసి క్షమాపణ పత్రం రాసిచ్చి, బహుశా డబ్బో, దస్కమో ముట్టచెప్పి ఆ ఫిర్యాదు వెనక్కి తీసుకోమన్నాడు. ఆమెను కోర్టుకు పిలిచినపుడు నాపై అత్యాచారం చేసినది యితను కాదు, వేరొకరు అని చెప్పింది. దాంతో కేసు ఎగిరిపోయింది. 

అక్కడితో అందరూ హమ్మయ్య అనుకుంటే బాగుండేది. కానీ కేరళ హైకోర్టు అడ్వకేట్స్‌ అసోసియేషన్‌ (కెఎచ్‌సిఎఎ) వారు సమావేశమై ప్రాథమిక విచారణ చేయకుండా అమాయకుడైన మంజూరన్‌ను పోలీసులు అనవసరంగా అరెస్టు చేసినందుకు నిరసన తెలుపుతూ పోలీసు స్టేషన్‌ వరకు నిరసన ప్రదర్శన చేయాలని తీర్మానించారు. పోలీసులకు ఒళ్లు మండి ఆ మహిళను అడలగొట్టారు. ఆమె క్షమాపణ పత్రాన్ని చూపించింది. పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకుని బహిరంగంగా చూపించారు. ఇక దాంతో అసోసియేషన్‌ వారు ఏం చేయలేక, వెర్రిమొహం వేసి, పరువు కాచుకోవడానికి 'ప్రదర్శనను వాయిదా వేస్తున్నాం' అని ప్రకటించారు. ఈ విషయాన్ని జులై 19 న రిపోర్టు చేస్తూ ఒక ప్రముఖ ఇంగ్లీషు దినపత్రిక విలేకరి 'అసోసియేషన్‌ సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు పొడసూపడంతో వాయిదా వేయడానికి నిర్ణయించుకున్నార'ని రాశాడు. అసోసియేషన్‌కు అది రుచించలేదు. 'మా మధ్య అభిప్రాయభేదాలు లేవు, మేమంతా ఏకగ్రీవంగా చేసిన తీర్మానం యిది' అని సవరణ వేయాలని అడిగారు. అతను సరేనన్నాడు. 

అయినా కొందరు లాయర్లు పోగడి, అతన్నీ, మరో రిపోర్టరును వెక్కిరించి, తిట్టి, పట్టుకుని కొట్టారు. పనిలో పనిగా 'ఇదే కాదు, యిలా తప్పుడు రిపోర్టింగు చేయడం మీకు అలవాటు అయిపోయిందంటూ మీడియా వారిని చుట్టుముట్టి గొడవ చేశారు. వారిలో కొందరు మహిళా జర్నలిస్టులు కూడా వున్నారు. దాంతో వాళ్లు హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. జర్నలిస్టులకు కేరళ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ (కెయుడబ్ల్యుజె)  పేర యూనియన్‌ వుంది కాబట్టి వాళ్లు రంగంలో దిగి జర్నలిస్టులకు జరిగిన అవమానానికి నిరసన తెలుపుతూ కోర్టు ఆవరణకు బయట ప్రదర్శన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇది అడ్వకేట్‌ అసోసియేషన్‌ వాళ్లకు కోపం తెప్పించింది. జులై 20న ఎప్పటిలాగా కోర్టు ఆవరణలోని మీడియా రూమును కేరళ హైకోర్టు వారి పబ్లిక్‌ రిలేషన్స్‌ శాఖ వారు తెరవగానే వాళ్లు వెళ్లి మూసేయమని గోల చేశారు. మీడియా రూములో వున్న టీవీ, ప్రెస్‌ రంగాలకు చెందిన కొందరు మహిళా జర్నలిస్టులను అల్లరి పెట్టారు. ఈ రగడ యిక్కడ జరుగుతూండగానే కోర్టుకు బయట జరుగుతున్న జర్నలిస్టు యూనియన్‌ ప్రదర్శన అదుపు తప్పింది. వాళ్లపై  అసోసియేషన్‌ వాళ్లు రాళ్లు వేయడం, ప్రతిగా వీళ్లూ రాళ్లు విసరడం జరిగాయి. పోలీసులు జర్నలిస్టులను కాపాడదామని చూశారు కానీ వేలాదిగా వున్న లాయర్లు (హైకోర్టులో 6 వేల మంది న్యాయవాదులు, పాతిక దాకా న్యాయమూర్తులు వున్నారు) పోలీసులను చుట్టుముట్టి ఎటూ కదలకుండా చేశారు. అంతేకాదు, మొగుణ్ని కొట్టి, మొగసాల కెక్కిన చందంగా 'తమపై పోలీసులు చేసిన దౌర్జన్యానికి నిరసనగా...' అంటూ తర్వాతి రెండు రోజులూ అంటే జులై 21, 22న కేరళ రాష్ట్రం మొత్తంలో అన్ని కోర్టులలో సమ్మెకు దిగారు. 

ఈ సమస్యపై టీవీ వారు నిర్వహించిన చర్చావేదికల్లో పాల్గొన్న కొందరు సీనియర్‌ న్యాయవాదులు తక్కినవారు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఈ పద్ధతులను నిరసిస్తూ 'అసోసియేషన్‌ వారు కాస్త ఓరిమి వహించి, న్యాయవాదుల గౌరవాన్ని కాపాడాల'ని అన్నారు. దాంతో అసోసియేషన్‌ వారు తాము చేపట్టిన 'ఉదాత్తమైన (నోబుల్‌)' ఉద్యమలక్ష్యాన్ని తప్పుపట్టినందుకు ఆరుగురు సీనియరు లాయర్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. హైకోర్టే కాదు, జిల్లా కోర్టులే కాదు, రాష్ట్రం మొత్తంలో ఏ కోర్టులోనూ మీడియావారు ప్రవేశించడానికి వీల్లేదని హుకుం వేశారు. జడ్జిగారి తీర్పు వచ్చాక ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన దాన్నుంచి మాత్రమే వార్తలు తీసుకోవాలి తప్ప వాదోపవాదాల గురించి రిపోర్టు చేయనక్కర లేదన్నారు. మీడియా రూములున్న కోర్టులన్నిటిలో ఆ గదులు మూయించేశారు. ఇది చాలా ఎబ్బెట్టు వ్యవహారంగా పరిణమించడంతో ముఖ్యమంత్రి విజయన్‌ అసోసియేషన్‌, బార్‌ కౌన్సిల్‌, యూనియన్‌ ప్రతినిథులతో ఒక కమిటీ వేయమని జులై 30న అడ్వకేట్‌ జనరల్‌ను ఆదేశించాడు. కమిటీ రెండుసార్లు సమావేశమైంది కానీ అప్పటి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి టిబి రాధాకృష్ణన్‌, యిప్పుడు ప్రధాన న్యాయమూర్తి ఐన శాంతన గౌండర్‌, మరో ఎనిమిది మంది న్యాయాధిపతులతో కలిసి అసోసియేషన్‌తో, యూనియన్‌తో చర్చలు జరిపారు కానీ చర్చలు సఫలం కాలేదు.  Readmore!

ఈ సమావేశాల్లో తమ సమస్యపై పత్రికలు వేసిన కార్టూన్లను, టీవీ చర్చలను ఎత్తిచూపిన అసోసియేషన్‌ వాటికి మీడియా క్షమాపణ చెప్పి, యికపై అలాటి వేయమని హామీ యివ్వాలని, తమ వృత్తి గురించి వేసే వార్తలన్నిటినీ వడపోయడానికి (స్క్రీన్‌ చేయడానికి) ఒక వ్యవస్థ వుండాలని, ఏ పత్రికను ఎవరు ప్రతినిథిగా రావాలో నిర్ణయించే హక్కు తమకుండాలని పట్టుబట్టారు. చివరగా రెండు, మూడు దశాబ్దాలుగా కోర్టు వ్యవహారాలు రిపోర్టు చేస్తున్న ఐదుగురు ప్రముఖ లీగల్‌ కరస్పాండెంట్లు కోర్టు ఆవరణలో అడుగు పెట్టడానికి వీల్లేదని అసోసియేషన్‌ పట్టుబట్టారు. మీడియావారు  యివేమీ కుదరదు పొమ్మన్నారు. తమ సంస్థల తరఫున ఎవర్ని పంపాలో, ఎవర్ని పంపకూడదో చెప్పడానికి యీ లాయర్లు ఎవరు? పైగా మా వార్తలపై యీ సెన్సార్‌షిప్‌ ఏమిటి? ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన న్యాయవాదులు, యిలాటి అప్రజాస్వామికమైన డిమాండ్లు ఎలా చేయగలరు అని నిలదీశారు. దశాబ్దాలుగా తాము ఉపయోగిస్తూ వచ్చిన మీడియా రూము తమకు అందుబాటులోకి తేవాలని గట్టిగా అడిగారు. అయితే అసోసియేషన్‌ ససేమిరా అంది. మీడియా రూము మూసే వుంచుతామని, జడ్జిల ఛాంబర్స్‌కు మీడియా వెళ్లకూడదని (కొందరు జడ్జిలు  కొన్ని సందర్భాల్లో న్యాయవాదులను తమ ఛాంబర్స్‌కు రానీయరు. కానీ పాత్రికేయులను రానిస్తారు. దానిపై కినిసిన లాయర్లు యీ షరతు కూడా చేర్చారు), తాము నిషేధించిన వారు తప్ప తక్కిన రిపోర్టర్లు రావచ్చని అసోసియేషన్‌ అంది. 

అలా అన్నా సెప్టెంబరు 30న ఎనిమిది మంది రిపోర్టర్లు హైకోర్టుకి వెళితే లాయర్ల బృందమొకటి వారిని చుట్టుముట్టి, వెళ్లిపోతారా లేకపోతే పట్టుకుని తన్నమంటారా? అని అడిగారు. ఇదెక్కడి అన్యాయం అని అడిగితే 'వాళ్లు పోలీసు రక్షణతో ఎందుకు రావాలి? అందుకే మాకు కోపం వచ్చింది' అని సమాధాన మిస్తున్నారు. 'మేమేమీ పోలీసులను ప్రాధేయపడలేదు. మాకు రక్షణ కల్పించమని కోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ యిచ్చిన ఆదేశాలను వారు అమలు చేస్తున్నారంతే' అంటారు జర్నలిస్టులు. ఈ వ్యవహారమంతా మొదటి నుంచీ గమనిస్తున్న సెబాస్టియన్‌ పాల్‌ అనే మాజీ ఎంపీ సెప్టెంబరు 7న ప్రెస్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశాడు. ప్రెస్‌ కౌన్సిల్‌ రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీకి ఫిర్యాదు చేసింది. 'కోర్టులోకి ప్రవేశించే హక్కు ప్రతి పౌరుడికి వుంటుంది. దాన్ని నిరాకరించడం తప్పు' అని చీఫ్‌ జస్టిస్‌ అన్నా, సామాన్యపౌరులు తమ ప్రవర్తనను ఖండిస్తున్నా న్యాయవాదులు ఖాతరు చేయడం లేదు. ఈ గొడవలన్నీ చేస్తున్నది ప్రాక్టీసు లేని కొందరు యువన్యాయవాదులు తప్ప తక్కినవారు కాదని కొందరంటున్నారు. కానీ వారిని ఏరి పారేసే శక్తి అసోసియేషన్‌కు లేకపోవడం వలన మొత్తం న్యాయవాద వృత్తికే అప్రతిష్ఠ కలుగుతోంది.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2016)

mbsprasad@gmail.com

Show comments